హైదరాబాద్ మరో అంతర్జాతీయ క్రీడా వేడుకకు సాక్ష్యంగా నిలిచింది. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 ప్రారంభమయ్యాయి. ఆదివారం ( మార్చి 8 ) అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎనిమిది దేశాల జట్లు పోటీపడనున్న ఈ మెగా ఈవెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముఖ్య అతిథిగా సైబరాబాద్ సీపీ
ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లకు సైబరాబాద్ సీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి పోటీలు నగరంలో నిర్వహించడం యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. మ్యాచ్ లకు సంబంధించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, ఎండీ సోనిబాలా దేవి కూడా పాల్గొన్నారు.
మైదానంలో హోరాహోరీ..
మొత్తం ఎనిమిది జట్లు రెండు పూల్‌లుగా విడిపోయి లీగ్ దశలో తలపడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఇంగ్లాండ్–ఇటలీ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైంది. అనంతరం కొరియా–ఆస్ట్రియా, స్కాట్లాండ్–వేల్స్ జట్లు పోటీ పడ్డాయి. రాత్రి 7:30 గంటలకు జరిగే భారత్–ఉరుగ్వే మ్యాచ్‌పై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. స్వదేశీ గడ్డపై భారత మహిళల జట్టు బోణీ కొట్టాలని ఆశిస్తున్నారు అభిమానులు.
టోర్నీ షెడ్యూల్:
- పూల్–ఏ: ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా
- పూల్–బీ: భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్
- మార్చి 8, 9, 11 తేదీల్లో లీగ్ మ్యాచ్‌లు.
- నాకౌట్ పోరు: మార్చి 13న సెమీ ఫైనల్స్,
- మార్చి 14న రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్.
