- నిత్యం దొరుకుతున్న సకినాలు, గారెలు, మురుకుల్లాంటి తీరొక్క పిండి వంటకం
- కుటీర పరిశ్రమగా అప్పాల తయారీ.. మహిళలకు ఏడాదంతా ఉపాధి
- సంక్రాంతికి స్పెషల్ ఆఫర్లు.. విదేశాలకూ ఆన్‌లైన్ డెలివరీ
కరీంనగర్, వెలుగు: మారుతున్న కాలంతోపాటు సంప్రదాయాలూ హైటెక్ బాట పట్టాయి. తీరిక లేని సమయం, ఓపిక లేని తరం వెరసి.. ఇప్పుడు ఇండ్లలో మూకుడు పెట్టే పరిస్థితి పోయి ‘హోం ఫుడ్స్’ షాపుల ముందు క్యూ కట్టే రోజులు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా పిండివంటలకు మార్కెట్ సెంటర్లే అడ్డాగా మారాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. ఒకప్పుడు వారం, పదిరోజుల ముందే ఇంటింటా మూకుడు పెట్టి తీరొక్క అప్పాలు చేసేవారు. పిండి పట్టించుకొని రావడం దగ్గరి నుంచి సకినాలు చుట్టడం, గారెలు, అరిసెలు ఒత్తడం, మురుకులు, బూందీ లడ్డూలు, గరిజెలు లాంటివి చేయడం .. వాటిని కాల్చడం.. ఇలా నాలుగైదు రోజులపాటు పని ఉండేది.
ఇంట్లో మహిళలతో పాటు మగవారు కూడా సాయం చేసేవారు. గ్రామాల్లో ఇరుగుపొరుగు మహిళలు కలిసి ఒక ఇంట్లో అయ్యాక మరో ఇంట్లో అప్పాలు చేసుకునే సంప్రదాయం కూడా ఉండేది. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. చదువు, ఉద్యోగరీత్యా నగరాల్లో ఉంటున్న నేటితరం పండుగకు చుట్టపుచూపుగా వచ్చిపోతున్నది. ఇక ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళలకైతే అసలు అప్పాలు చేసే తీరికే ఉండడం లేదు. గ్రామాల్లో ఉంటున్నవారు సైతం గతంలో మాదిరి రోజుల తరబడి అప్పాలు చేసే ఓపిక లేక ఒకటి, రెండు రకాలకే పరిమితమవుతున్నారు. ఇంకా ఈ జనరేషన్ యువతుల్లో చాలా మందికి సకినాలు చుట్టడం రావడం లేదు. అందుకే చాలా మంది అప్పాల కోసం హోం ఫుడ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. నిర్వాహకులు సైతం సంక్రాంతికి అప్పాలపై స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తూ జనాల్ని ఆకర్షిస్తున్నారు. హోం ఫుడ్స్, తెలంగాణ పిండివంటల పేరుతో గతంలో ఒకటీ ఆరా కనిపించిన సెంటర్లు.. ఇప్పుడు హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో పుట్టగొడుగుల్లా వెలిశాయి. మారిన పరిస్థితిల్లో క్రమంగా పల్లెలకూ విస్తరించాయి.
కిలోల చొప్పున అమ్మకాలు
హోంఫుడ్స్ సెంటర్లలో తయారు చేస్తున్న సకినాలు, గారెలు, మడుగుబూలు, మురుకులు, అరిసెలు, భక్ష్యాలు, లడ్డూలు, సున్నుండలను కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. పండుగ సీజన్లలోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ పిల్లలకు బాక్సుల్లో స్నాక్స్ కోసం తల్లిదండ్రులు తీసుకెళ్తుండడంతో వీటికి ఏడాది పొడవునా గిరాకీ ఉంటున్నది. సకినాలు, గారెల్లాంటివి కిలోకు రూ.300 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారు. స్థానికంగా విక్రయించడంతోపాటు విదేశాలకు కూడా ఆన్ లైన్‌లో ఆర్డర్లపై కార్గో సర్వీసుల ద్వారా డెలివరీ చేస్తున్నారు. మామూలు రోజుల్లో రోజుకు 20 కిలోల నుంచి 30 కిలోల అప్పాలు అమ్మే వ్యాపారులు.. సంక్రాంతి సీజన్‌లో రోజుకు 100 నుంచి 150 కిలోల వరకు అప్పాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో కొందరు నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. రేట్లు తగ్గించడంతోపాటు 5 కిలోలు కొంటే ఒక కిలో ఉచితం అంటూ జనాల్ని ఆకట్టుకుంటున్నారు. అప్పాలను చేసుకొనే తీరిక లేనివారంతా హోంఫుడ్స్‌ను ఆశ్రయిస్తుండడంతో వీటికి గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. సంక్రాంతికి రెండు వారాల ముందు నుంచే ఆర్డర్లు వస్తున్నట్లు హోంఫుడ్స్ నిర్వాహకులు చెప్తున్నారు.
సుల్తాన్ పూర్ అప్పాలు చాలా ఫేమస్..
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో మారుమూల గ్రామమైన సుల్తాన్‌పూర్ గత రెండు దశాబ్దాలుగా అప్పాల తయారీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇండ్లలో జరిగే పెళ్లిళ్లు, సీమంతం పండుగలాంటి శుభకార్యాలతోపాటు దసరా, సంక్రాంతిలాంటి పండుగల సమయంలోనూ ఈ గ్రామ మహిళలు కిలోలకొద్దీ పిండి వంటలను ఆర్డర్లపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాలకు, దేశాలకు సప్లై చేస్తున్నారు. గ్రామానికి చెందిన లక్ష్మి సారథ్యంలో 10 మంది మహిళలతో
ప్రారంభమైన అప్పాల తయారీ..
కుటీర పరిశ్రమగా మారి నేడు అరకోటి టర్నోవర్‌కు చేరింది. వారి స్ఫూర్తితో ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మరో ఆరు గ్రూపులు ఏర్పడ్డాయి. మొత్తం ఈ అప్పాల తయారీ ద్వారా ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 300 మంది మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
ఉపాధిగా అప్పాల తయారీ..
అప్పాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌తో చాలా మంది మంది మహిళలు అప్పాల తయారీని ఉపాధిగా మలుచుకుంటున్నారు. దీంతో హోంఫుడ్స్ బిజినెస్ కుటీర పరిశ్రమగా మారింది. మిగతా బిజినెస్‌లతో పోలిస్తే పెట్టుబడి తక్కువ కావడం, సంప్రదాయ పిండివంటలకు ఏడాదంతా గిరాకీ ఉండడంతో చాలా మంది మహిళలు ఈ బిజినెస్ పై ఆసక్తి చూపుతున్నారు. ఈ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు.. మరికొందరు మహిళలతో కలిసి అప్పాలు చేయిస్తూ షాపులను నడుపుతున్నారు.
ఏటేటా గిరాకీ పెరుగుతున్నది..
మేం మొదట షాపు ప్రారంభించిన కొత్తలో అప్పాలు కొనేవాళ్ల సంఖ్య తక్కువగా ఉండేది. రానురాను షాపులో గిరాకీ పెరిగింది. మాములు రోజుల్లో రోజుకు కనీసం 30 కిలోల అప్పాలు అమ్ముతున్నం. ఆర్డర్లపై పెళ్లిళ్లు, సీమంతాలతోపాటు విదేశాలకు సప్లై చేస్తున్నాం. దసరా, సంక్రాంతిలాంటి పండుగ సీజన్ లోనైతే రోజూ 100 కిలోలకుపైగా అమ్ముడవుతున్నాయి. మా దగ్గర 30 మంది మహిళలు పనిచేస్తున్నారు. - జె. సుజాతరెడ్డి, హోంఫుడ్స్ వ్యాపారి, కరీంనగర్
సంక్రాంతికి ఆర్డర్‌పై తయారు చేస్తం..
సంక్రాంతి పండుగ సందర్భంగా సకినాలు, గారెలు, లడ్డూలు, జంతికలను ఆర్డర్లపై తయారు చేస్తం. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వస్తాయి. కిలోకు 300 రూపాయల చొప్పున తీసుకుంటున్నం. ఇతర దేశాలకు పంపించేవారు సైతం ఆర్డర్లు ఇచ్చి తీసుకొని పోతరు. పండుగలకే కాకుండా శుభకార్యాలకు సైతం ఆర్డర్ల మీద తయారుచేసి ఇస్తున్నం.
- దేమే అశోక్ కుమార్ గుప్తా, జమ్మికుంట, హోంఫుడ్స్ వ్యాపారి
