జస్టిస్ అనే పదం రోమన్ పారిభాషికలోని జాస్టేషియా అనే పదం నుంచి ఉద్భవించింది. జాస్టేషియా అంటే కలపడం, బంధించడం లేదా సమానులను చేయడం అని అర్థంగా పేర్కొంటున్నాయి. సమాజంలోని వివక్షతలను బంధించే అన్నివర్గాలను కలుపుతూ అసమానతలను రూపుమాపడమే న్యాయం పరమార్థం.
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రజలందరికీ న్యాయాన్ని అందించడమే భారత రాజ్యాంగ లక్ష్యం. ఈ అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు రష్యా విప్లవం ఆధారంగా రూపొందిన రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
రాజకీయ న్యాయం: రాజకీయ న్యాయాన్ని అందించడం కోసం ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, పదవులను చేపట్టడం, విమర్శ అనే రాజకీయ హక్కులను సమాన ప్రాతిపదికపై ప్రజలందరికీ కల్పించారు.
సామాజిక న్యాయం: సామాజిక న్యాయం సాధించడం కోసం ప్రధానంగా రెండు చర్యలను చేపట్టారు. సాంఘిక విక్షను రూపుమాపడానికి అంటరానితనాన్ని నిషేధించడం, కట్టు బానిసత్వం, వెట్టి చాకిరీ, మనుషుల అక్రమ రవాణా, బాల కార్మిక నిషేధం వంటి చట్టాలను రూపొందించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలను కల్పించారు.
ఆర్థిక న్యాయం: ఆర్థిక న్యాయం కోసం ఉత్పత్తిదారులు, వినియోగదారుల సంక్షేమ చర్యలను చేపట్టడంతోపాటు పేదరికం, నిరుద్యోగం నిర్మూలించడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టారు.
ఎస్.లింగప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సామాజిక న్యాయం అనే అంశం సకారాత్మక దృక్పథాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు పరచాలి. అంటే ఈ పదం ప్రభుత్వాలకు మార్గదర్శకాన్ని చూపుతుంది.
సహజ న్యాయ సిద్ధాంతం
సహజ న్యాయం అనేది నైతికత, అంగీకారమైనదిగా ఉండాలి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అవకాశాలను వినియోగించడానికి తోడ్పడేదిగా ఉండాలి. సహజ న్యాయం వ్యక్తి స్వేచ్ఛను, సమానత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలని జస్టిస్ పి.డి. దినకరన్ వర్సెస్ జడ్జస్ ఎంక్వైరీ కమిటీ మధ్య జరిగిన వ్యాజ్యంలో 2011లో సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. కేసర్ ఎంటర్ ప్రైజెస్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నియంతృత్వంతో వ్యవహరించ కుండా ఉండటానికి తోడ్పడేది అని పేర్కొన్నది.
