నిజామాబాద్ జిల్లాలో కో ఆప్షన్ పోస్టులకు పైరవీల జోరు

నిజామాబాద్ జిల్లాలో  కో ఆప్షన్ పోస్టులకు పైరవీల జోరు
  • మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, ఓడిన అభ్యర్థుల ప్రయత్నాలు 
  •     నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్‌‌‌‌లో రెండేసి స్థానాలు ఇవ్వాలని మజ్లిస్ పట్టు 
  •     అధిక పోటీతో కలవరపడుతున్న కాంగ్రెస్​అధిష్టానం

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు మూడు మున్సిపాలిటీల ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం విఫలయత్నం చేసిన నేతలు కో-ఆప్షన్ పదవుల కోసం జోరుగా పైరవీలు చేస్తున్నారు. కో ఆప్షన్ పోస్టుల కోసం ముఖ్య నేతలు పోటీ పడుతుండడంతో కాంగ్రెస్​అధిష్టానాన్ని కలవరపెడుతోంది. కో-ఆప్షన్ పదవుల సర్దుబాటు ఎలా చేయాలని లీడర్లు సతమతమవుతున్నారు. 

నగర పాలక సంస్థలో మేయర్ ఎన్నికకు, బోధన్ మున్సిపాలిటీలో చైర్‌‌‌‌పర్సన్ ఎన్నికకు మద్దతు ఇచ్చి డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌‌‌‌పర్సన్ పదవులు పొందిన మజ్లిస్ కో-ఆప్షన్ పోస్టుల్లోనూ సగం కావాలని కోరడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 

17 కో-ఆప్షన్ పదవులు..  

నిజామాబాద్​మున్సిపల్​ కార్పొరేషన్​లో 5, బోధన్, ఆర్మూర్, భీంగల్​మున్సిపాలిటీల్లో నాలుగు చొప్పున కో-ఆప్షన్ పదవులు ఉన్నాయి. కార్పొరేటర్, కౌన్సిలర్‌‌‌‌కు సమాన హోదా ఈ పోస్టులకు ఉంటుంది. వీరికి చర్చల్లో పాల్గొనే అధికారం ఉంటుంది. ఇతర సభ్యుల మాదిరిగానే గౌరవ వేతనం కూడా అందుతుంది.  తీర్మానాల ఆమోదం వంటి కీలక అంశాల్లో ఓటు హక్కు ఉండదు. అవసరమైతే కార్పొరేషన్ లేదా మున్సిపల్ కౌన్సిల్ కో-ఆప్షన్ సభ్యుల సలహాలు కోరవచ్చు.   

నిజామాబాద్‌‌‌‌పై ఎక్కువ ఫోకస్.. 

జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ కో-ఆప్షన్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. 2020లో కేవలం ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఈసారి 60 డివిజన్‌‌‌‌లలో పోటీ చేసి 17 సీట్లు సాధించింది. ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వలేకపోయిన వారిలో ఆరుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రూరల్ సెగ్మెంట్ పరిధిలోని రెండు డివిజన్‌‌‌‌లకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించాలని అక్కడి నేతలు పట్టుబడుతున్నారు. 

ఎన్నికల్లో ఓడిన సుమారు 20 మంది కో-ఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు. ఐదు కో-ఆప్షన్ స్థానాల్లో మజ్లిస్ రెండు కావాలని కోరడం కాంగ్రెస్‌‌‌‌కు సవాల్‌‌‌‌గా మారింది. బోధన్‌‌‌‌లోని నాలుగు స్థానాల్లో కూడా రెండు ఇవ్వాలని మజ్లిస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఆర్మూర్, భీంగల్‌‌‌‌లలో ఓటమి చెందిన 12 మంది, టికెట్ దక్కని 8 మంది కో-ఆప్షన్ రేసులో ఉన్నారు. 

ప్రమాణాలకు లోబడి.. 

కో-ఆప్షన్ స్థానాలకు అనుగుణంగా ఏకాభిప్రాయం కుదిరితే సమస్య ఉండదు. లేకపోతే ఎన్నికల విధానం అమలు చేయాల్సి ఉంటుంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేతులు పైకెత్తి ఓటింగ్ ద్వారా కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. అవసరమైతే మున్సిపల్ కమిషనర్ సీక్రెట్ ఓటింగ్ నిర్వహించవచ్చు. గతంలో మున్సిపల్ సభ్యులుగా పనిచేసిన మాజీలు, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, అడ్వకేట్లు, సామాజిక సేవా నేపథ్యమున్నవారు, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కో-ఆప్షన్ సభ్యులుగా అర్హులు. మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి. అవసరమైతే నాన్-మైనారిటీలను కూడా నియమించవచ్చు. మహిళకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ ప్రమాణాల ఆధారంగా వారం రోజుల్లో అన్ని కోణాల్లో పరిశీలించి ఎంపిక చేయాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తున్నారు.