సింహళ జాతి వీరుడు దుతుగెముడు

సింహళ జాతి వీరుడు దుతుగెముడు

సింహళ రాజు కవన తిస్స తన జాతి ప్రాబల్యాన్ని తిరిగి నెలకొల్పడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అంతేగాక ఆక్రమణదారులకు కప్పం చెల్లించి, తన ఇద్దరు కుమారులు గెమును, సద్ద తిస్సలు చేత ‘దమిలులకు (తమిళులకు) వ్యతిరేకంగా ఎలాంటి సాయుధ విప్లవం చేయబోమని ప్రమాణం చేయించాడు. పెద్దకొడుకైన గెమును తండ్రి, తమ్ముని కంటే శక్తివంతుడు. గెమును లక్ష్యం ప్రతీకార సేనను తయారుచేయడం మీదనే కేంద్రీకృతమై ఉండేది. అతడు ఒక పది మంది యువనాయకులను కూడగట్టాడు. రాజుగారి అనుమతి లేకున్నా ఆ వీరుల సాయంతో ఒక సైన్యాన్ని తయారుచేశాడు. ఉత్తర సరిహద్దు దగ్గర ఎప్పుడూ ఉండేలా దళాలను ఏర్పాటుచేశాడు. తూర్పు దిశగా ప్రవహించే మహా వెల్లిగంగ నది దగ్గర దిఘవాపి అనే చోట ఆ నది దమిళ సింహళ రాజ్యాలకు మధ్య సరిహద్దుగా ఉండేది.

రెండు జాతుల మధ్య జరుగుతున్న యుద్ధంలో కుమారుడు కొత్త సమస్యలు సృష్టించవచ్చనే భయంతో గెమునును తండ్రి అక్కడి నుంచి పంపించాడు. తండ్రిని గెమును ఎలారా మీదికి దాడిచేయడానికి ఒప్పుకోమని అడగ్గా ఆయన నిరాకరించడంతో కోపంతో స్త్రీలు ధరించే కంకణాన్ని తొడుక్కోమని తండ్రికి పంపాడు. అది రాజుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన తన కొడుకుని సంకెళ్లతో బంధించమని చెప్పాడు. కానీ, గెమును తప్పించుకుని ఆ ద్వీపానికి దక్షిణ కేంద్ర భాగంలో ఉన్న పర్వత ప్రాంతానికి పారిపోయాడు. ఆ ప్రాంతాన్ని అప్పుడు మలయా అనేవారు. అప్పటి నుంచి అతన్ని ‘దుతుగెమును’ అనేవారు.

దానర్థం మాతాపితృయోగ్యమైన విధేయత లేనివాడు అని. దుతుగెమును కొన్నేండ్లు అజ్ఞాతంలో ఉన్నాడు. తన తండ్రి మరణవార్త ఆయన ఏకాంతాన్ని భంగం చేసింది. సద్ద తిస్స, తాను చేసిన పితృ ప్రమాణాన్ని తోసిరాజని సింహాసనాన్ని, రాజమాతను రాచ ఏనుగు కందులను స్వాధీనం చేసుకున్నాడు. రాజ్యాధికారం కోసం తిరిగి వచ్చిన గెమును తమ్ముడి చేతిలో ఓడిపోయాడు. అయినా నిరుత్సాహపడకుండా తన దగ్గర మిగిలిన ఆఖరి రెండు బంగారు చెవి పోగులను ఇద్దరు బీద థెరాల వారికి ఇచ్చేసి మళ్లీ యుద్ధానికి బయలుదేరాడు. ఈసారి ఆయన ఎక్కువ విజయుడయ్యాడు. ఈ విషయం తెలిసి సద్ద, గెమునును కలవడానికి వచ్చాడు.

అక్కడ జరిగిన ఘర్షణలో గెమును ప్రాణభయంతో బౌద్ధమఠంలోకి పారిపోయాడు. అతన్ని దాచడానికి సన్యాసులు కట్టుకునే పసుపు రంగు వస్త్రాలు ధరింపజేశారు. దుతుగెమును అది గ్రహించి, తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్లతో కలిసివెళ్లాడు. విజయవంతంగా నగరంలో అడుగుపెట్టిన ఆయన సన్యాసులతో, యుద్ధ వీరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విందు మధ్యలో సభలోకి చినిగిన బట్టలతో అవమానంతో సద్ద వచ్చి పశ్చాత్తాపంతో క్షమాభిక్ష అడిగాడు. దుతుగెముడు అతన్ని క్షమించి, అన్నకి ప్రోత్సాహం ఇచ్చిన సన్యాసులను ఉద్దేశించి మాట్లాడాడు. గెమును పట్టాభిషిక్తుడయ్యాక ఏమాత్రం కాలయాపన చేయకుండా దళాలను కూడగట్టాడు.

తన యుద్ధరంగం ధ్వజం మీద ఒక పవిత్ర చిహ్నాన్ని ధరించి, ముందుగా తనకు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి దట్టమైన అడవిగుండా కొందరిని పంపించాడు. ఇలా ఎన్నో యుద్ధాల తర్వాత దుతుగెమును సింహళాన్ని తెలివిగా పరిపాలించాడు. ఆస్పత్రులు కట్టించాడు. వృద్ధులకు, అవసరమైనవాళ్లకు ఉచిత భోజనం పెట్టించాడు. సన్యాసుల కోసం మఠాలు కట్టించాడు. ఆయన కట్టించిన బౌద్ధ కట్టడాలు ఎంతో పేరుతెచ్చాయి.

అందులో సన్యాసులు, యోగులు ఉండేవారు. వజ్రాలు, పగడాలు, ముత్యాలు, బంగారం, రాగి వంటి విలువైన వాటితో కట్టిన ఆ భవంతి సన్యాసుల మఠంలా కాకుండా రాజభవనంలా ఉండేది. ఆ తర్వాత బంగారు ధూళి ఆలయం కట్టించడం మొదలుపెట్టాడు. అది పూర్తి కావడానికి ముందు రోజు రాజుకు జబ్బు చేసింది. వెంటనే తమ్ముడికి కబురు పంపి ఆలయాన్ని త్వరగా కట్టించమన్నాడు. కొన్నాళ్లకు సద్ద, సన్యాసులు నిర్మాణం పూర్తయిందని చెప్పారు. వెంటనే రాజు వెళ్లి చూద్దామన్నాడు. అక్కడికి వెళ్లడానికి మార్గం కోసం మరికొంత టైం అడిగారు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆయన మరణించాడు. 

- మేకల మదన్​మోహన్​ రావుకవి, రచయిత