సాధారణంగా పక్షవాతం అనేది ముసలివారికి వచ్చే జబ్బు అని మనం అనుకుంటాం. కానీ, తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి ఏడుగురు స్ట్రోక్ రోగులలో ఒకరు 45 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. అంటే యువతలో ఈ సమస్య ఈ కాలంలో చాలా వేగంగా పెరుగుతోంది.
యువతలో స్ట్రోక్ రావడానికి కారణాలు చూస్తే దాదాపు 75% కేసుల్లో హై బిపి ముఖ్య కారణం. దీనితో పాటు డయాబెటిస్ కూడా తోడవుతోంది. ధూమపానం, మద్యం సేవించడం, పొగాకు వాడకం వల్ల నరాలు దెబ్బతింటున్నాయి.
అధిక పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయసులోనే స్ట్రోక్ వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇతర కారణాలు చూస్తే విపరీతమైన ఊబకాయం, నిద్రలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కూడా దీనికి కారణమవుతున్నాయి.
గోల్డెన్ అవర్ - ఎందుకు ముఖ్యం:
స్ట్రోక్ వచ్చిన మొదటి 4, 5 గంటల సమయం చాలా విలువైనది. ఈ సమయంలోపు ఆసుపత్రికి చేరితే, మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని కరిగించే చికిత్సలు అందించి ప్రాణాలను కాపాడవచ్చు. దురదృష్టవశాత్తు, మన దేశంలో కేవలం 20% మంది మాత్రమే ఈ సమయంలోపు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆలస్యం చేయడం వల్ల శాశ్వతంగా వైకల్యం లేదా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది.
స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం ఎలా:
పక్షవాతం లక్షణాలను గుర్తించడానికి ఈ చిన్న BE FAST సూత్రం గుర్తుంచుకోండి.
B (Balance): హఠాత్తుగా నడకలో బ్యాలెన్స్ తప్పడం.
E (Eyes): చూపు మసకబారడం లేదా కనిపించకపోవడం.
F (Face): ముఖం ఒక పక్కకు వాలిపోవడం.
A (Arms): ఒక చేయి లేదా కాలు బలహీనంగా, తిమ్మిర్లు అనిపించడం.
S (Speech): మాట తడబడటం లేదా సరిగ్గా మాట్లాడలేకపోవడం.
T (Time): పైన చెప్పినవి కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
నివారణ మార్గాలు:
మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను అప్పుడప్పుడు పరీక్షించుకోండి. ఉప్పు తగ్గించి, పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజు సరిపడా నిద్ర పోవాలి ఇంకా యోగా లేదా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందాలి. ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా మానేయడం ఉత్తమం. స్ట్రోక్ అనేది ప్రాణాపాయం కలిగించే సమస్యే కానీ, జాగ్రత్తగా ఉంటే దీనిని ముందే నివారించవచ్చు.
►ALSO READ | Health : మీకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయా.. అయితే ఆరోగ్యం కోసం రన్నింగ్ బెస్టా.. యోగా మంచిదా.. జిమ్ బెటరా..?
