భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప దార్శనికుడు వివేకానందుడు. ‘భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ దేశాలలో సైతం మన సంప్రదాయాన్ని ఆమోదయోగ్యంగా బోధించారు. భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచ ఉషోదయానికై ఉదయించిన ఆధ్యాత్మిక భాస్కరుడైన స్వామి వివేకానంద జీవితగాథను అందరం చదివితీరాలి. ఇది ఒక భగవదనుభూతి పొందిన వ్యక్తి జీవిత గాథ’ అని స్తుతించబడిన వ్యక్తి వివేకానందుడు.
స్వర్గంలో జీవించే ఒక ఋషి మానవరూపుదాల్చి, ఏతెంచారు’’ అని భగవాన్ శ్రీరామకృష్ణుల చేత, ‘‘హిందూమతాన్ని కాపాడారు, తద్వారా భారతదేశాన్ని కాపాడారు’’ అంటూ మహాపండితుల చేత శ్లాఘించబడిన వ్యక్తి వివేకానందుడు.
అంతటి ఉన్నతమైన వ్యక్తి అయిన వివేకానందుడికి రామకృష్ణ పరమహంస దైవసమానులు. ఆయన పేరు మీదుగా దేశవ్యాప్తంగా రామకృష్ణ మఠాలను స్థాపించి గురు దక్షిణ చెల్లించుకున్నారు. ఆ మఠాల ద్వారా ఎంతోమంది విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచారు స్వామి వివేకానంద. జనవరి 12 వివేకానంద జయంతి. ఈ రోజును యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా వివేకానందుడు యువతను ఉత్తేజపరచిన కొన్ని మాటలను గుర్తు చేసుకుందాం.
విజయం వరించిందని విర్రవీగకు.. ఓటమి ఎదురైందని నిరాశ చెందకు... విజయమే అంతం కాదు... ఓటమి తుది మెట్టు కాదు...’’ అనే మాటలు వింటే రామాయణం, మహాభారతం గుర్తుకు వస్తాయి. రామాయణంలో రాముడు ... పట్టాభిషేకం అని చెప్పినా అడవులకు వెళ్లాలని చెప్పినా... రెండు సందర్భాలలోనూ ఒకే విధంగా ప్రవర్తించాడు. తనకు పట్టాభిషేకం అని పొంగిపోలేదు, అరణ్యవాసమని కుంగిపోనూ లేదు. వివేకానందుడు ఆ కథ ఆధారంగానే ఈ సూక్తి చెప్పి ఉండవచ్చు.
మరొక మంచి మాట మనల్ని నిత్యం అనుసరించమని సూచించాడు వివేకానందుడు.
ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్యధారా నిశితా దురత్కయాదుర్గం పథస్తత్ కవయో వదంతి లేవండి, మేల్కొండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి, శ్రేష్ఠులైన ఆచార్యులను ఆశ్రయించి ఆత్మను సాక్షాత్కరించుకోండి. ఆత్మసాక్షాత్కార మార్గం కత్తి అంచులా తీక్షణమైనది. దానిని అనుసరించడం ఎంతో ప్రయాసతో కూడినదనీ, తరిండం ఎంతోకష్టమనీ విజ్ఞులు చెబుతారు’’ అన్నమాటలను లోతుగా పరిశీలిస్తే... శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని దగ్గర విద్యాభ్యాసం చేసి, ఆత్మసాక్షాత్కారం పొందిన అంశం స్ఫురణకు వస్తుంది. రోజూ ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి.
లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు’ అనే మాట మహాభారతంలో విదురనీతిని గుర్తుకు చేస్తుంది. ధృతరాష్ట్రుడికి విదురుడు నీతి బోధించిన సమయంలో ఈ విధంగానే పలుకుతాడు.
‘మీకు సాయం చేస్తున్నవారిని మరువకండి... మిమ్మల్ని ప్రేమిస్తున్నవారిని ద్వేషించకండి.,, మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం’ చేయకండి.. అనే వివేకానందుని సూక్తి మన వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా చెప్పినదే. మహాభారతంలోను, రామాయణంలోను ఇటువంటి సూక్తులు మనకు గోచరిస్తాయి.
ఎవరికోసమో దేనికోసమో ఎదురుచూడకండి... మీరు చేయగలిగింది చేయండి... ఎవరి మీదా ఆశ పెట్టుకోకండి...’ అనే వివేకానందుని వాక్కులు, శ్రీశ్రీ రచించిన ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా’ అనే పాటకు ప్రేరణగా కనిపిస్తాయి. వివేకానందుని వాక్కులు అందరినీ ప్రభావితం చేశాయనడానికి ఇది మంచి ఉదాహరణగా కనిపిస్తుంది.
మరొక సూక్తి శిలాక్షరంగా కనిపిస్తుంది. ‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరచే దేన్నయినా విషంతో భావించి, తిరస్కరించండి.’ రామాయణంలో రావణుడు సీతమ్మను అపహరించిన సందర్భంలో రాముడు పసిపిల్లవానిగా విలపించినప్పుడు, లక్ష్మణుడు అన్నగారితో, ‘అన్నయ్యా! ఉత్సాహాన్ని విడిచిపెట్టకూడదు’ అని పలుకుతాడు. దుఃఖం విషంతో సమానం. దుఃఖం మానవుని బలాన్ని తగ్గించేస్తుంది.
మరొక సూక్తిలో – ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అంటూ ఉత్తేజపరుస్తాడు వివేకానందుడు. ‘ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి’ అనే శ్రీశ్రీ కవితకు ఈ మాటలే ప్రేణగా కనిపిస్తాయి.
‘మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి... బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి’ అంటూ యువతను నిరంతరం ఉత్తేజపరుస్తూనే వచ్చాడు వివేకానందుడు. ప్రతిమనిషిలోను కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయం మనిషిని బలవంతునిగా చేయాలే గాని, బలహీనునిగా చేయకూడదు. మనసు బలహీనపడితే ఆత్మహత్యలకు దారితీస్తుంది. అందువల్లే దుఃఖంలో ఏ నిర్ణయమూ తీసుకోకూడదంటారు పెద్దలు.
ఇటువంటి ఎన్నో సూక్తులను మనకు అందించిన వివేకానందుడిని గురువుగా భావించి, వారి మాటలను అనుసరించితే జాతి జాగృతం అవుతుంది.
- డా. పురాణపండ వైజయంతి
