ఒక్క కోర్సుతో మొదలై.. అటానమస్ స్థాయికి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచిన మెదక్ డిగ్రీ కళాశాల

 ఒక్క కోర్సుతో మొదలై.. అటానమస్ స్థాయికి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచిన మెదక్ డిగ్రీ కళాశాల
  •      రాష్ట్రంలోనే టాప్ ​10లో నిలిచి హోదా దక్కించుకున్న మెదక్​ డిగ్రీ కళాశాల
  •      1981లో కాలేజీ ప్రారంభం
  •      ప్రస్తుతం 14 కోర్సులు.. 1,443 మంది విద్యార్థులు
  •      21 సంస్థలతో ఎంవోయూ
  •      మూడుసార్లు న్యాక్​ గ్రేడ్ హోదా

మెదక్, వెలుగు:  ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీ, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అటానమస్​ హోదా ఉండగా.. తాజాగా యూజీసీ నుంచి మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆ హోదా దక్కింది. రాష్ట్రంలో మొత్తం 149 డిగ్రీ కాలేజీలు ఉండగా అడ్మినిస్ట్రేషన్​, ఎంవోయూలు, సీఎస్సార్ అంశాల్లో మెదక్​కాలేజీ టాప్​10లో ఉండటం ఇందుకు దోహదపడింది.  

మొదట్లో బీఏ కోర్సు ఒక్కటే

1981 ఆగస్టులో కేవలం బీఏ కోర్సు ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్నేండ్లకు బీకాం, బీఎస్సీ ప్రవేశపెట్టారు. కోర్సులకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మెదక్ డిగ్రీ కాలేజీలో14 కోర్సులు ఉన్నాయి.  

బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు బీజెడ్​సీఎస్, ఎంపీసీఎస్​వంటి సెల్ఫ్​ఫైనాన్స్​ కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తం1,443 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెగ్యులర్, గెస్ట్ ఫ్యాకల్టీ కలిపి 46 మంది లెక్చరర్లు ఉన్నారు. కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, నాలెడ్జ్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. 3 ఎన్ఎస్ఎస్​యూనిట్లు, ఒక ఎన్ సీసీ యూనిట్​ఉన్నాయి. 

అప్​డేట్​ అవుతూ వచ్చిన కాలేజీ

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మెదక్ డిగ్రీ కాలేజీ అప్​డేట్​అవుతూ వచ్చింది. యాజమాన్యం తీసుకున్న చర్యల ఫలితంగా మూడుసార్లు న్యాక్​గ్రేడ్​సాధించింది. ఒక సారి బి, మరోసారి బి–ప్లస్​, ఇంకోసారి బి–గ్రేడ్​దక్కాయి. 2014లో అటానమస్ కు అప్లై చేయాలని కాలేజ్​కమిషనరేట్​నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల చేయలేదు. 

2023లో న్యాక్ బి–గ్రేడ్​ఉన్న డిగ్రీ కాలేజీలన్నీ అటానమస్​ కు అప్లై చేయాలని మరోసారి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు అటానమస్​ సాధనే లక్ష్యంగా వివిధ కమిటీలు వేసి, ప్రణాళికలు రూపొందించి, అకాడమిక్​యాక్టివిటీస్​పెంచారు. అన్ని డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో సెమినార్​లు, వర్క్ షాప్ లు, వివిధ అంశాలపై అవేర్​నెస్​ప్రోగ్రామ్స్​నిర్వహించారు. 

సీఎస్సార్​ నిధులతో సౌకర్యాలు

ఎన్జీవోల సహకారంతో కాలేజీ అభివృద్ధి, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పోస్టల్ డిపార్ట్​మెంట్​తదితర 21 ఆర్గనైజేషన్లతో ఎంవోయూ  కుదుర్చుకున్నారు. సీఎస్సార్​కింద ఓ ఎన్జీవో కాలేజీకి 200 ల్యాప్​టాప్​లు అందజేసింది. మరో ఎన్జీవో రూ.30 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలు ఇచ్చింది. ఎన్.వి.లక్ష్మీ ఫౌండేషన్ విద్యార్థినుల కోసం అత్యాధునిక హంగులతో టాయిలెట్స్ నిర్మించింది.

విద్యార్థినులకు సర్వైకల్​క్యాన్సర్​ నిరోధానికి రూ.8 వేల విలువైన వ్యాక్సిన్​ను ఉచితంగా ఇప్పించేందుకు ముందుకొచ్చింది. తెలంగాణ రెడ్​కో సంస్థ తక్కువ కరెంట్​తో పనిచేసే 80 ఫ్యాన్లను వితరణ చేసింది. 

ఢిల్లీకి చెందిన వాటర్ లైఫ్​సంస్థ రూ.24 లక్షలతో ప్యూరిఫైడ్​వాటర్​ప్లాంట్​ఏర్పాటు చేస్తోంది. అలాగే, సుల్తాన్​చంద్​ట్రస్ట్​ 9 మంది విద్యార్థులకు రూ.98 వేల విలువైన ట్యూషన్​ఫీజు చెల్లించడంతోపాటు రూ.9.26 లక్షలతో 2 వేల పైచిలుకు పుస్తకాలు అందిస్తామని ప్రకటించింది. ఇన్ఫోసిస్​ సంస్థ 40 కంప్యూటర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కాలేజీలో సోలార్​ఎనర్జీ సిస్టం కోసం రూ.35 లక్షలతో ప్రతిపాదనలు పంపారు.

కొత్త కోర్సులకు అవకాశం

డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా రావడం సంతోషంగా ఉంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎగ్జామినేషన్​బ్రాంచి ఏర్పాటవుతుంది. పరీక్ష పేపర్లను, ఆన్సర్​బుక్ లెట్​ లను సొంతగా తయారు చేసుకోవచ్చు. విద్యార్థులకు 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు తగ్గుతాయి. స్థానిక అవసరాల దృష్ట్యా నైపుణ్యాలు పెంచేందుకు కొత్తగా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది.  - హుస్సేన్​, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్​