- రూ.2.81 కోట్లు వసూలు కాగా, బకాయిలు రూ.3.29 కోట్లు
- గతేడాది బకాయిలే రూ. 2.15కోట్లు
- టైమ్ నెల రోజులే
- వసూలు బట్టే 16వ ఫైనాన్స్ ఫండ్స్
జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూలుపై యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. మార్చి 30తో ఫైనాన్సియల్ ఇయర్ ముగుస్తున్నందున సాధ్యమైనంత త్వరగా వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వసూలు చేయాల్సి లక్ష్యం భారీగా కన్పిస్తోంది. ఈ వసూలు ఆధారంగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే అవకాశాలున్నాయి.
15,818 నిర్మాణాలు..
జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. మున్సిపాలిటీలో పన్ను చెల్లించే నిర్మాణాలు మొత్తంగా 15,818 ఉన్నాయి. వీటిల్లో ఇండ్లు 13,010 ఉండగా, ఇండ్లు, షాపులు కలుపుకొని 1670 నిర్మాణాలున్నాయి. పూర్తి కమర్షియల్‌గా 1138 నిర్మాణాలున్నాయి. వీటన్నింటిని కలుపుకొని ప్రతి ఏటా రూ.6.03 కోట్లు ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఏ ఫైనాన్స్ ఇయర్‌లోనూ వంద శాతం వసూలు కావడం లేదు. అయితే పాలకవర్గాల గడువు ముగిసినా స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగడం, ఫైనాన్స్ ఇయర్ చివరి దశకు వచ్చే సమయానికి మున్సిపాలిటీ ఎన్నికలు రావడం, కొత్త పాలకవర్గం ఏర్పాటైంది.
46 శాతమే వసూలు..
ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 10 నెలలుగా మున్సిపాలిటీలో 46 శాతమే ఆస్తి పన్ను వసూలు చేశారు. ఈ వసూలును బట్టి స్టాఫ్ నిక్కచ్చిగా వ్యవహరించకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. రూ.6.03 కోట్లలో కేవలం రూ.2.81 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఈ ఫైనాన్సియల్ ఇయర్‌కు కేవలం నెల రోజులే గడువు ఉండగా, ఆలోపే రూ.3.29 కోట్ల బకాయిలు వసూలు చేయాల్సి ఉంది. కాగా, గతేడాది టార్గెట్ రూ.5.77 కోట్లు ఉండగా, రూ.3.62 కోట్లు వసూలు చేశారు. అప్పటి బకాయిలే రూ.2.15 కోట్లు బకాయిలు ఉండగా, ఈఏడాది బకాయిలతో కలిపి మొత్తంగా రూ.5.44 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను వసూలు కోసం 8 మందితో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి తోడుగా 30 మంది వార్డు ఆఫీసర్లు వసూలు చేయడానికి వెళ్తున్నారు. వీరందరికీ కొత్తగా టాక్స్‌కు సంబంధించి రిసిప్ట్ ఇవ్వడానికి హ్యాండ్ మిషన్లు కూడా అందించారు. మార్చి నెలాఖరువరకు టార్గెట్ చేరుకోవడంపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే పన్ను చెల్లించని వారి ఇంటి నల్లా కనెక్షన్ కట్ చేయాలని నిర్ణయించారు.
టాక్స్ వసూలు బట్టే..
ప్రాపర్టీ టాక్స్ వసూలు బట్టే మున్సిపాలిటీలకు 16వ ఆర్థిక సంఘం ఫండ్స్ వస్తూ ఉంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు. రూల్స్ ప్రకారం గత ఫైనాన్స్ ఇయర్లో వసూలు చేసిన టాక్స్ కంటే 12.06 శాతం ఎక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే గతేడాది 65 శాతం టాక్స్ వసూలు చేశారని, ఈసారి 75 శాతం నుంచి 80 శాతం వరకూ టాక్స్ వసూలు చేస్తేనే మున్సిపాలిటీకి 19వ ఆర్థిక సంఘం నుంచి రూ.10 కోట్ల వరకూ ఫండ్స్ వస్తాయని తెలిపారు.
ఆస్తి పన్ను చెల్లించాలి..
ప్రతి ఒక్కరూ ఆస్తి పన్ను చెల్లించడం బాధ్యతగా భావించాలి. పన్ను చెల్లిస్తేనే టౌన్లో మౌలిక వసతుల విషయంలో చర్యలు తీసుకోగలుగుతాం. చెల్లించని వారిపై ఈసారి కఠినంగా వ్యవహరిస్తాం.
- మహేశ్వర్ రెడ్డి, కమిషనర్, జనగామ మున్సిపాలిటీ
