వనపర్తి జిల్లాలో పేరు కుపోయిన ‘స్త్రీ నిధి’ రుణ బకాయిలు

 వనపర్తి జిల్లాలో  పేరు కుపోయిన ‘స్త్రీ నిధి’ రుణ బకాయిలు
  •      వసూలుకు ఆర్ఆర్​చట్టం అమలుకు సిద్ధం
  •      వనపర్తి జిల్లాలో రూ.20కోట్ల దాకా బకాయిలు

వనపర్తి, వెలుగు :  మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న స్త్రీ నిధి రుణాల బకాయిలు వనపర్తి జిల్లాలో పేరుకుపోతున్నాయి. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో  ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందిస్తోంది. 

తీసుకున్న రుణాలు సకాలంలో రికవరీ కావడంలేదని గుర్తించిన అధికారులు వాటి వసూలుకు  సన్నద్ధమవుతున్నారు. ఏండ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్టును ఉపయోగించాలని నిర్ణయించింది. 

ఆడిట్​ ద్వారా చెక్​చేసి.. 

గ్రామసంఘాల్లో  అవకతవకలు జరిగాయని తెలిసినప్పుడు ఆడిటింగ్​ చేస్తారు. అలాంటి సందర్భంలో ఏ సంఘంలో ఏ మెంబర్​ ఎంతేసి రుణ బకాయి ఉన్నది తెలుస్తుంది.  రుణ మంజూరు సిస్టమంతా ఆన్​లైన్​ లోనే చేస్తుండడంతో లబ్ధిదారుల ఐరిస్, థంబ్, బయోమెట్రిక్​ వివరాలను నమోదు చేస్తారు. సంఘం తీర్మానాన్ని కూడా అప్​లోడ్​ చేస్తారు.  

ఒక సంఘం మెంబర్​ తీసుకుని లోన్​ కట్టకపోతే ఆ సంఘమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సంఘంలో ఒక్క మెంబర్​ బకాయి ఉన్నా ఆ సంఘానికి తరువాత రుణ మంజూరు చేయరు. దాంతో సంఘాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంటుంది. ఆడిట్​రిపోర్టులో తేలిన మేరకు సంబంధిత లబ్ధిదారుల నుంచి బకాయిలను రాబడతారు.  

ఎక్కువ బకాయిలు వనపర్తి మండలంలోనే.. 

మహిళా సంఘాల సభ్యుల తీర్మానం మేరకు ఒక్కో సభ్యురాలికి కోరిన మేరకు రూ.25వేల నుంచి  రూ.3లక్షల వరకు తక్షణ రుణాలు ఇచ్చారు. తీసుకున్న రుణాలను వాయిదా పద్ధతిలో వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, చాన్నాళ్లుగా బకాయిలు పడ్డారు. 

ఎక్కడ.. ఎంత బకాయిలు..

వనపర్తి జిల్లాలో ని ఐదు మున్సిపాలిటీలతో పాటు 13 మండలాల్లో  స్త్రీ నిధి రుణ బకాయిలు రూ.20కోట్ల దాకా ఉన్నాయని  అధికారులు గుర్తించారు. వనపర్తి మండలంలో రూ.2.50కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అమరచింత మండలంలో రూ.38లక్షలు, ఖిల్లాగణపురంలో రూ.42లక్షలు, కొత్తకోటలో రూ.48లక్షలు, ఆత్మకూరులో రూ.83లక్షలు, శ్రీరంగాపురంలో రూ.95లక్షలు, చిన్నంబావిలో రూ.1.09కోట్లు, రేవల్లిలో రూ.1.11కోట్లు, గోపాల్​పేటలో రూ.1.12కోట్లు, వీపనగండ్ల రూ.1.20కోట్లు, పెబ్బేరులో రూ.1.38కోట్లు, మదనాపరంలో  రూ.1.50కోట్లు, పాన్​గల్​ మండలంలో రూ.2.21 కోట్లు బకాయిలున్నాయి.  

ఫస్ట్​ నోటీసు తరువాత ఆర్ఆర్​ యాక్టు

స్త్రీనిధి కింద బకాయిలున్న మెంబర్లకు మొదట నోటీసులిస్తాం. ఇప్పటికే బకాయి ఉన్న మొత్తాన్ని బట్టీ నోటీసులిస్తూ వస్తున్నాం. బకాయిలను వసూలు చేసేందుకు ప్రభుత్వం ఆర్ఆర్ యాక్టును అమలు చేయాలని  ఈ మధ్యనే నిర్ణయం తీసుకుంది. మొండి బకాయిలున్న వారి నుంచి ఆర్ఆర్​ యాక్టు ద్వారా వసూలు చేస్తాం.    - సందీప్​, స్త్రీనిధి రీజినల్​ మేనేజరు, వనపర్తి