ఖమ్మం జిల్లాలో తునికాకు సేకరణకు టెండర్లు..!

ఖమ్మం జిల్లాలో  తునికాకు సేకరణకు టెండర్లు..!
  • ఇప్పటివరకు జిల్లాలో16,900 స్టాండర్డ్​ బ్యాగుల ఆకు సేకరణకు టెండర్లు ఫైనల్​ 
  •     దశలవారీగా టెండర్లను పిలువనున్న ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​
  •     జిల్లాలో 33,500 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణే లక్ష్యం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఏజెన్సీ వాసులకు తునికాకు సేకరణ వేసవిలో ఉపాధి కల్పిస్తోంది. తునికాకు సేకరణకు ఫారెస్ట్ ​డిపార్ట్​మెంట్ దశలవారీగా ఆన్​లైన్ ద్వారా టెండర్లను పిలుస్తోంది. ఇప్పటివరకు 16,900 స్టాండర్డ్​బ్యాగుల తునికాకు సేకరణకు టెండర్లు ఫైనల్ అయ్యాయి. మిగిలిన టెండర్లు ఫైనల్ దశలోఉన్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 674 కల్లాల్లో 33,500 స్టాండర్డ్​ బ్యాగుల తునికాకు సేకరణే లక్ష్యం పెట్టుకున్నారు. 

తునికాకు సేకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం..

మండు టెండల్లో దట్టమైన అడవుల్లోకి వెళ్లి తునికాకును గిరిజనులు సేకరిస్తుంటారు. తునికాకు సేకరణ ద్వారా వచ్చిన డబ్బులను గిరిజనులు వ్యవసాయ పనిముట్లు కొనుగోళ్లు, శుభకార్యాలకు ఉపయోగిస్తుంటారు. ఈ తునికాకు సేకరణ సమయంలో పలువురు అడవి జంతువుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తునికాకు సేకరణ ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. 

తునికాకు సేకరణ టెండర్లు ఈసారి కొంత ఆలస్యమయ్యాయి. ఇప్పటికే టెండర్లు ఫైనల్ కావాల్సి ఉంది. టెండర్లు ఫైనల్ అయితేనే ఏజెన్సీ వాసులు ప్రూనింగ్​పనులు చేపడుతారు. ప్రూనింగ్​పనులు ఆలస్యమైతే ఆకు నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 30 యూనిట్లలోని 674 కల్లాల్లో 33,500స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ చేపట్టనున్నారు. భద్రాచలం డివిజన్​లో ఐదు యూనిట్లకు132 కల్లాల్లో 9,700 స్టాండర్డ్​బ్యాగులు, మణుగూరు డివిజన్​లో ఐదు యూనిట్లలోని 112  కల్లాల్లో 5,400 ఎస్బీలు, పాల్వంచ డివిజన్​లో నాలుగు యూనిట్లలోని 124 కల్లాల్లోని 2,300 ఎస్​బీలు, వైల్డ్​లైఫ్ కిన్నెరసాని డివిజన్​లో ఐదు యూనిట్లలోని 55 కల్లాల్లో 3,200 ఎస్​బీలు, కొత్తగూడెం డివిజన్​లో మూడు యూనిట్లలోని 81 కల్లాల్లో 2,300 ఎస్​బీలు, ఇల్లెందు డివిజన్​లో 8 యూనిట్లలోని 170 కల్లాల్లో 10,600 ఎస్​బీల తునికాకు సేకరణే లక్ష్యంగా డిపార్ట్​మెంట్ టెండర్లను పిలిచింది. 

ఇప్పటివరకు 16,900 యూనిట్ల స్టాండర్డ్​బ్యాగుల తునికాకు సేకరణలకు టెండర్లు ఫైనల్ అయ్యాయి. ఈ నెలాఖరులోపు మొత్తం టెండర్లను ఫైనల్ చేసేందుకు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​చర్యలు తీసుకుంటుంది.