బంజారాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి దనసరి సీతక్క

బంజారాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి దనసరి సీతక్క

ములుగు, వెలుగు : బంజారా కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి దనసరి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ ఆలయ సమీపంలో సద్గురు సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన భూమిలో బుధవారం సేవాలాల్‌ జయంతి నిర్వహించారు.

కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్‌ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ... సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించడం  హర్షించదగిన విషయం అన్నారు.

బంజారా కులస్తుల భవన నిర్మాణం కోసం ప్రత్యేక స్థలం కేటాయించినట్లు చెప్పారు. బంజారాల ఆరాధ్యదైవం గుడి నిర్మాణం కోసం మద్దిమడుగులో 20 ఎకరాలు, ములుగులో 20 గుంటల స్థలం కేటాయించడం పట్ల పోరిక గోవింద్‌నాయక్‌ కృతజ్క్షతలు తెలిపారు. కార్యక్రమంలో పూజారులు రమేశ్‌ గిరి మహరాజ్‌, కిషన్‌ మహరాజ్‌, ఐటీడీఏ డీడీ జనార్ధన్, నాయకులు రాహుల్, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి పాల్గొన్నారు.

అనంతరం మంత్రి సీతక్క కలెక్టరేట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఆఫీసర్లకు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. పనులు క్వాలిటీ ఉండడంతో పాటు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.