Mana Shankara Varaprasad Garu Business: చిరంజీవి కెరియర్లోనే భారీ బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

Mana Shankara Varaprasad Garu Business: చిరంజీవి కెరియర్లోనే భారీ బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రేపు సోమవారం (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘U/A’ సర్టిఫికేట్ లభించింది. సాహు గారపాటి, మెగా డాటర్ సుస్మిత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలు మరియు టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. ఇవాళ జనవరి 11న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య వివిధ థియేటర్లలో వేర్వేరు టైమింగ్స్‌తో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.

ఈ ప్రీమియర్ షోల టికెట్ ధరను ప్రభుత్వం జీఎస్టీతో కలిపి రూ. 600గా నిర్ణయించింది. ఇక యూఎస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్‌కు చేరువగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మరియు ఫస్ట్ డే ప్రీమియర్స్‌ను కలిపి ఇప్పటివరకు రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.

సంక్రాంతి బరిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాలతో బాక్సాఫీస్ దూకుడును కొనసాగిస్తోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఈ సినిమా బిజినెస్ ఎంత చేసింది? బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు చేయాలి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం. 

థియేట్రికల్ బిజినెస్ వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ బిజినెస్ నమోదు చేసింది. ప్రాంతాల వారీగా థియేట్రికల్ రైట్స్ వివరాలు ఇలా ఉన్నాయి:

నైజాం (తెలంగాణ) – రూ.31 కోట్లు

రాయలసీమ – రూ.18 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.14 కోట్లు

గుంటూరు – రూ.9 కోట్లు

తూర్పు గోదావరి – రూ.9.50 కోట్లు

పశ్చిమ గోదావరి – రూ.7.20 కోట్లు

కృష్ణా – రూ.7.25 కోట్లు

నెల్లూరు – రూ.4.25 కోట్లు

ఈ విధంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు ప్రీ–రిలీజ్ బిజినెస్ పరంగా భారీ ట్రేడ్ జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో కలిపి ఈ చిత్రం రూ.105 కోట్ల ప్రీ–రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమా కనీసం రూ.210 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

తెలుగేతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే, కర్ణాటక హక్కులు సుమారు రూ.10 కోట్లకు, అలాగే ఇతర రాష్ట్రాల రైట్స్ సుమారు రూ.5 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ విధంగా ఇండియా మొత్తానికి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువను ట్రేడ్ వర్గాలు సుమారు రూ.120 కోట్లుగా అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద, ఇండియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇక ఓవర్సీస్ రైట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకు నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ సుమారు రూ.20 కోట్ల మేర ట్రేడ్ జరిగినట్లు సమాచారం. అమెరికా మరియు కెనడా మార్కెట్లలో డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి రావాలంటే ఈ చిత్రం కనీసం 5 మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సుమారు రూ.260 కోట్ల ప్రీ–రిలీజ్ ట్రేడ్ జరిగినట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది.

ఈ స్థాయిలో బిజినెస్ జరిగిన క్రమంలో, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.450 నుంచి రూ.500 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ బిజినెస్ లెక్కలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

సినిమా విశేషాలు

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. సంక్రాంతి ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఇందులో మేళవించడంతో పాటు, పాటలు, ప్రమోషన్లు, ఇంటర్వ్యూల ద్వారా సినిమాపై భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.

ఈ చిత్రంలో చిరంజీవి మాజీ NIA ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార ‘శశిరేఖ’ అనే సంపన్న యువతిగా మెగాస్టార్ సరసన నటిస్తోంది. అంతేకాదు, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక కేమియో పాత్రలో కనిపించటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.