కొత్త సంవత్సరంలో హిందువులు జరుపుకొనే ఫస్ట్ పండుగ.. పెద్ద పండుగ.. సంక్రాంతి పండుగ. ఇది జానపదుల పండుగ, కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయంలో చేసుకునే సంబురం. అన్నింటికి మించి పర్యావరణాన్ని పూజించుకునే వేడుక. గంగిరెద్దుల ఆటలతో, హరిదాసుల సంకీర్తనలతో, అమ్మాయిల గొబ్బి పాటలతో, కొత్త అల్లుళ్ళ రాకతో ఊరంతా సందడిగా మారే రోజు సంక్రాంతి.
సంక్రాంతి పండుగ గంగిరెద్దుల హడావిడి
సంక్రాంతి పండుగలో చెప్పుకోవాల్సిన ప్రత్యేకత గంగిరెద్దుల హడావిడి. వాటిని ఆడించేవాళ్లు ... గంగిరెద్దులతో వీధుల్లో తిరుగుతూ, డోలు, సన్నాయి వాయిస్తారు. అందుకు అనుకూలంగా గంగిరెద్దులతో ఆటలు ఆడిస్తారు. మోకాళ్ల మీద వంగి, వాళ్ల గుండెలపై కాళ్లు పెట్టి గంగిరెద్దులు ఆడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. 'అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు' అని వాళ్లు చెప్తుంటే ఎద్దులు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయి.
ఎద్దుల మోపురాన్ని శివలింగంలా భావిస్తారు. దానిని రంగురంగుల దుస్తులతో అలంకరిస్తారు. కాళ్లకు గజ్జెలు కడతారు. ఈ పండుగరోజు గంగిరెద్దులు ఇంటి ముందు వచ్చి నిలబడటాన్ని జానపదులు శుభంగా భావిస్తారు. వ్యవసాయానికి ఆధారమైన ఎద్దుకు సంతోషంగా కానుకలు ఇచ్చి పంపిస్తారు. కానీ, ప్రస్తుతం సిటీల్లోనే కాదు గ్రామాల్లోనూ గంగిరెద్దులను ఆడించే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు జనవరి మొత్తం కనిపించే వాళ్లు, ఇప్పుడు పండుగ మూడు రోజుల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు.
హరిదాసులు
ముఖం మీద తిరునామాలు. కాళ్లకు గజ్జెలు. చేతిలో చిడతలు, నెత్తిమీద రాగితో చేసిన పాత్ర పెట్టుకొని సంక్రాం తికి హరిదాసులు తిరుగుతుంటారు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ. వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం. కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు.
హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ. తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటిచెప్పే హరిదాసు కీర్తనల్లో, రూపంలో ఉంటుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
