జూబ్లీహిల్స్ బైపోల్.. ఐదు రోజుల ముందే..ఆ 103 మందికి ఇంటి నుంచి ఓటింగ్

జూబ్లీహిల్స్ బైపోల్.. ఐదు రోజుల ముందే..ఆ 103 మందికి  ఇంటి నుంచి ఓటింగ్

జూబ్లీహిల్స్ బైపోల్ కు నవంబర్ 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో  వృద్ధులు, వికలాంగులకు నవంబర్ 4, 6వ తేదీల్లో హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. నవంబర్ 5న   కార్తీక పౌర్ణమి సెలవు కావడంతో 4,6 తేదీల్లో రెండు రోజుల పాటు హోమ్ ఓటింగ్ కు అవకాశం కల్పించింది.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు హోమ్ ఓటింగ్ కు  వృద్ధులు, వికలాంగులు మొత్తం 103 మంది  అప్లై చేసుకున్నారు.  ఎన్నికల సంఘం 85 ఏళ్ల పైబడిన వృద్ధులకు, 40 శాతం కంటే ఎక్కువ అంగ వైకల్యం కలిగిన వ్యక్తులకు ఇంటి దగ్గరే  తమ ఓటు హక్కును వినియోగించుకొనే సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే.

జూబ్లీహిల్స్ లో హోమ్ ఓటింగ్ కి 84 మంది వృద్ధులు, 19 మంది వికలాంగులు అప్లై చేసుకున్నారు . వృద్ధులు, వికలాంగుల ఇంటికి వెళ్ళి సీక్రెట్ గా ఓటింగ్ వేయించి.. ఓట్లను కలెక్ట్ చేసి యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరచనున్నారు ఎన్నికల అధికారులు.  జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 85 ఏళ్లకు పై బడిన ఓటర్లు 2,134 ఉండగా... వికలాంగ ఓటర్లు 1,908 మంది ఉన్నారు. హోమ్ ఓటింగ్ పై అవగాహన, ప్రచారం చేయకపోవడంతో  వృద్ధులు, వికలాంగులు తక్కువ సంఖ్యలో అప్లై చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 4 లక్షల 13వందల 65  ఓటర్లు ఉన్నారు.  వీరిలో  2 లక్షల8 వేల 561 పురుష ఓటర్లు..  లక్షా 92వేల779 మహిళల ఓట్లు,25 ఇతరుల ఓట్లు ఉన్నాయి.

ప్రధాన  పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ఉండనుంది.  సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.