నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
  • రూ. లక్ష నగదు, తులం బంగారం ఉన్న సూట్‌కేస్‌ అప్పగింత  

హాలియా, వెలుగు: దొరికిన సూట్‌ కేసును అప్పగించి ఆటో డ్రైవర్​ నిజాయతీని చాటుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లికి గ్రామానికి చెందిన కొక్కు సత్యం అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వ్యక్తిగత పని మీద తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంబోతు హిరియానాయక్ ఆటో లో ఎక్కి హాలియాకు వచ్చాడు.

సత్యం తన సూట్ కేసును ఆటోలో మరిచిపోయి ఆటో దిగి హాలియా సెంటర్లో బస్సు ఎక్కి మల్లేపల్లి కి వెళ్లిపోయాడు.  ఆటోడ్రైవర్ ఆంబోతు హిరియానాయక్  ఆటోలో దొరికిన సూట్ కేసును పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి హాలియా ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ యాదయ్య కు అప్పగించారు. సూట్ కేసులో రూ. లక్ష నగదు, ఒక తులం బంగారం ఉంది.  వెంటనే హాలియా పోలీసులు స్పందించి సదరు కొక్కు సత్యం ను పిలిపించి నగదు, తులం బంగారం ఉన్న సూట్ కేసును తిరిగి అప్పగించారు. ఆటో డ్రైవర్  నిజాయతీని హాలియా సీఐ దేవిరెడ్డి సతీష్​రెడ్డి, ఎస్​ఐ ప్రశాంత్​ అభినందించారు.