సింధు ముందుకు.. సైనా ఇంటికి

సింధు ముందుకు.. సైనా ఇంటికి
  • ప్రణయ్‌‌, కశ్యప్‌‌, సౌరభ్‌‌ శుభారంభం
  • సాయి ప్రణీత్‌‌, సమీర్‌‌ పరాజయం

హాంకాంగ్‌‌: వరల్డ్‌‌ చాంపియన్‌‌ పీవీ సింధు.. హాంకాంగ్‌‌ ఓపెన్‌‌లో ఈజీ విక్టరీతో బోణీ కొట్టగా.. మరో స్టార్‌‌ షట్లర్‌‌ సైనా నెహ్వాల్‌‌ ఫస్ట్‌‌ రౌండ్‌‌లోనే ఓడి మరోసారి నిరాశ పరిచింది. హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌, పారుపల్లి కశ్యప్‌‌ కూడా శుభారంభం చేయగా.. సాయి ప్రణీత్‌‌, సమీర్‌‌ వర్మ ఇంటిదారి పట్టారు.  బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో ఆరో సీడ్‌‌ సింధు 21–15, 21–16తో ప్రపంచ 19వ ర్యాంకర్‌‌ కిమ్‌‌ గా ఎయున్‌‌ (కొరియా)పై వరుస గేమ్స్‌‌లో విజయం సాధించి రెండో రౌండ్‌‌కు దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్‌‌లో థాయ్‌‌లాండ్‌‌కు చెందిన బుసానన్‌‌తో పోటీకి రెడీ అయింది. అయితే, ఎనిమిదో సీడ్‌‌ సైనా నెహ్వాల్‌‌ 13–21, 20–22తో చైనా షట్లర్‌‌ కై యాన్‌‌ యాన్‌‌ చేతిలో ఓడిపోయింది. తన చివరి ఆరు టోర్నమెంట్లలో సైనా ఫస్ట్‌‌ రౌండ్‌‌లోనే ఓడిపోవడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. పురుషుల సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లోనూ ఇండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

చైనా ఓపెన్‌‌లో నిరాశ పరిచిన హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ 21–17, 21–17తో హువాంగ్‌‌ యు జియాంగ్‌‌ (చైనా)ను ఓడించి తొలి అడ్డంకి దాటాడు. వెటరన్‌‌ ప్లేయర్‌‌ కశ్యప్‌‌ 21–18, 16–21, 21–10తో కెంటా నిషిమొటో (జపాన్‌‌)పై 66 నిమిషాల పాటు పోరాడి గెలిచాడు.  యువ షట్లర్‌‌, క్వాలిఫయర్‌‌ సౌరభ్‌‌ వర్మ 21–14, 21–15తో బ్రైస్‌‌ లెవెర్డెజ్‌‌ (ఫ్రాన్స్‌‌)పై గెలిచి సెకండ్‌‌ రౌండ్‌‌ చేరాడు. టాప్‌‌ సీడ్‌‌ కెంటా మొమోటా గైర్హాజరీలో ఫస్ట్‌‌రౌండ్‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌కు వాకోవర్‌‌ లభించింది. అయితే, కెరీర్‌‌ బెస్ట్‌‌ పదో ర్యాంక్‌‌కు చేరుకున్న తెలుగు షట్లర్‌‌ సాయి ప్రణీత్‌‌ 21–11, 18–21, 12–21తో మూడో సీడ్‌‌ షి యుకీ (చైనా) చేతిలో మూడు గేమ్‌‌ల పాటు పోరాడి ఓడిపోయాడు. 16వ ర్యాంకర్‌‌ సమీర్‌‌ వర్మ 11–21, 21–13, 8–21తో చైనీస్‌‌ తైపీ షట్లర్‌‌ వాంగ్‌‌ జు వై చేతిలో ఓడి వరుసగా మూడో టోర్నీలోనూ తొలి రౌండ్‌‌లోనే నిష్క్రమించాడు.   డబుల్స్‌‌లోనూ ఇండియాకు ప్రతికూల ఫలితాలే వచ్చాయి.  పురుషుల డబుల్స్‌‌ ఫస్ట్‌‌ రౌండ్‌‌లో సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ శెట్టి ద్వయం 21–17, 16–21, 17–21తో టకురొ హొకి–యుగొ కొబయషి (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది.  మహిళల డబుల్స్​లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జోడీ 13–21, 12–21తో మైకెన్‌‌ ఫ్రుయెర్గాడ్‌‌–సారా తైగెసెన్‌‌ (డెన్మార్క్‌‌) జంట చేతిలో ఓడి తొలి రౌండ్‌‌లోనే నిష్క్రమించింది.

Hong Kong Open: PV Sindhu, HS Prannoy, Parupalli Kashyap advance; Saina Nehwal, Sameer Verma, Sai Praneeth ousted in first round