IPL 2025: ఆ విషయం ధోనీనే చెప్తారు.. మేం జోక్యం చేసుకోము: CSK CEO

IPL 2025: ఆ విషయం ధోనీనే చెప్తారు.. మేం జోక్యం చేసుకోము: CSK CEO

ఐపీఎల్ టోర్నీ ముగుస్తుందంటే మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ గురుంచి వార్తలు రావడం సహజమే. గత రెండేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. మహేంద్రుడు సైతం తన వీడ్కోలు గురించి ఎటూ తేల్చక కాలయాపన చేస్తున్నాడు. తాజాగా, ఈ విషయం చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ చెంతకు రాగా.. అలాంటిది ఏమైనా ఉంటే ధోనినే తెలియజేస్తారని తెలిపారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని బదులిచ్చారు. 

ప్రస్తుతం ధోని వయసు.. 42 ఏళ్లు. మరో నెల గడిస్తే.. 43. ఈ క్రమంలో అతను మరో సీజన్ కొనసాగేది అనుమానమే. అందునా మోకాలి గాయంతో మాజీ కెప్టెన్ ప్రస్తుత సీజన్‌లోనూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. చివరి రెండు మూడు ఓవర్లలోనే బ్యాటింగ్ చేశాడు. ఎప్పుడు గుడ్ బై చెప్తారో అని అభిమానులు పెద్ద ఎత్తున  స్టేడియాలకు తరలివచ్చారు. దీంతో అతని రిటైర్మెంట్ భవిష్యత్తు గురించి రకరకాలుగా ఊహాగానాలు మొదలయ్యాయి. 

ఈ విషయంపై తాజాగా నోరు విప్పిన చెన్నై మేనేజ్‌మెంట్.. ధోనీని భవిష్యత్తు గురించి తామెప్పుడూ అడగలేదని, కోరుకున్నప్పుడు కాల్ చేయమని అతనికే వదిలేశామని చెప్పారు.

"డ్రెస్సింగ్ రూమ్‌లో దాని గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. మేము అతని భవిష్యత్తు గురించి ఎప్పుడూ అడగలేదు, దాని గురించి అతను ఏమీ చెప్పలేదు. దానిపై నిర్ణయం తీసుకున్నప్పుడు, అతనే మాకు తెలియజేస్తాడు, అప్పటి వరకు మేము జోక్యం చేసుకోము.." అని సీఎస్కే సీఈఓ విశ్వనాథన్ ఓ జాతీయ ఛానెల్ తో అన్నారు. 

ఈ సీజన్‌లో ధోని 14 మ్యాచ్‌ల్లో 53.67 సగటుతో 220.55 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశాడు.