KKR vs SRH: ఆదుకున్న త్రిపాఠి, కమిన్స్.. కోల్‌కతా ఎదుట పోరాడే లక్ష్యం

KKR vs SRH: ఆదుకున్న త్రిపాఠి, కమిన్స్.. కోల్‌కతా ఎదుట పోరాడే లక్ష్యం

కీలక మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆశలు పెట్టుకున్న ఓపెనర్లిద్దరూ నిండా ముంచారు. ట్రావిస్‌ హెడ్ (0) డకౌట్‌ కాగా.. అభిషేక్ శర్మ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో హైదరాబాద్‌కు భారీ పరాజయం తప్పదనిపించింది. అలాంటి సమయంలో రాహుల్ త్రిపాఠి (55), క్లాసెన్ (32), కెప్టెన్ పాట్ కమ్మిన్స్(30) జట్టును ఆదుకున్నారు. దాంతో ఆరంజ్ ఆర్మీ 19.3 ఓవర్లలో 159 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

కోల్‌కతా పేసర్లు మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా విజృంభించడంతో సన్‍రైజర్స్ ఆదిలోనే కష్టాల్లో పడింది. స్టార్క్ తొలి ఓవర్ రెండో బంతికి ట్రావిస్‌ హెడ్ (0)ను బౌల్డ్ చేయగా.. ఆ మరుసటి ఓవర్‌లో అభిషేక్ శర్మ (3)ను అరోరా పెవిలియన్ చేర్చాడు. అనంతరం  ఐదో ఓవర్‌లో స్టార్క్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. ఐదో బంతికి నితీశ్‌ రెడ్డి (9) వెనుదిరగ్గా.. చివరి బంతికి షాబాజ్ అహ్మద్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆరంజ్ ఆర్మీ  39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న త్రిపాఠి- క్లాసెన్

ఆ సమయంలో రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) జోడి ఆదుకున్నారు. వీరిద్దరూ రాణించడంతో హైదరాబాద్ 10 ఓవర్లు ముగిసేసరికి 92 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న సమయాన వరుణ్‌ చక్రవర్తి దెబ్బకొట్టాడు. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ (32)ను ఔట్ చేశాడు. అక్కడినుంచి సన్‍రైజర్స్ ఇన్నింగ్స్ తలకిందులైంది. లేని పరుగు కోసం యత్నించి త్రిపాఠి రనౌట్ అవ్వగా.. అనవసరపు షాట్ తో అబ్దుల్ సమద్ (16) పెవిలియన్ చేరాడు. చివరలో కమ్మిన్స్(24 బంతుల్లో 30) విలువైన పరుగులు చేసి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలా వికెట్ తీసుకున్నారు.