KKR vs SRH: సన్‌రైజర్స్‌ ఘోర పరాజయం.. ఫైనల్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా

KKR vs SRH: సన్‌రైజర్స్‌ ఘోర పరాజయం.. ఫైనల్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా

అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‍రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో హైదరాబాద్ జట్టు రెండు విభాగాల్లోనూ విఫలమైంది. మొదట బ్యాటర్లు విఫలమవ్వగా.. అనంతరం బౌలర్లు వారి అడుగుజాడల్లోనే నడిచారు. ఫలితంగా, ఆరంజ్ ఆర్మీ కోల్‌కతా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎంతో శ్రమించి హైదరాబాద్‌ బ్యాటర్లు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ చేధించారు. 13.4 ఓవర్లలోనే మ్యాచ్ ముగించి గర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టారు.

160 పరుగుల ఛేదనలో కోల్‌కతాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్(23; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్ నరైన్(16 బంతుల్లో 21; 4 ఫోర్లు) జోడి తొలి వికెట్ కు 44 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(58; 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేష్ అయ్యర్(51; 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరో వికెట్ కోల్పోకుండా మ్యాచ్ ముగించారు. ఈ జోడి సన్‌రైజర్స్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. మరోవైపు, ఓటమి ఖాయం అవ్వడంతో ఆటగాళ్లు లైట్ తీసుకున్నారు.  ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి బౌలింగ్ చేసి మ్యాచ్ త్వరగా ముగిసేందుకు సహాయపడ్డారు.   

ఆదుకున్న త్రిపాఠి, కమిన్స్ 

అంతకుముందు కోల్‌కతా బౌలర్లు విజృభించడంతో హైదరాబాద్‌ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్ గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్ (32), కమిన్స్ (30) పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (3), నితీశ్‌ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్‌ (0), సమద్ (16), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సన్వీర్ సింగ్ (0) అందరూ నిరాశ పరిచారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు. 

ఈ మ్యాచ్‌లో గెలిచి  కోల్‌కతా గర్వంగా ఫైనల్‌లో అడుగుపెడితే.. ఓడిన  సన్‌రైజర్స్‌ క్వాలిఫయర్-2లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.