
హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్ ఎండీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేకానంద్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ అమెరికా ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ డాక్టరేట్ ప్రకటించారు.
అణగారిన వర్గాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో కాకా వెంకటస్వామి 50 ఏండ్ల కింద అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి, కాకా వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేకానంద్ కృషి చేస్తున్నారు.
అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సరోజా వివేకానంద్ పాటు పడుతున్నారని, అంబేద్కర్ విద్యా సంస్థలకు ఆమె అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ అమెరికా పేర్కొంది.