- ఇరాన్ సైన్యం, నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేశాం
- దాదాపు 158 నౌకలు గాల్లో కలిశాయి..వారి వద్ద ఉన్న మైన్ డ్రాపర్లు కూడా ఖతం
- ఆ దేశం ఆయిల్ అమ్మకుండా ఇతర దేశాలు సహకరిస్తున్నాయని వెల్లడి
- నాటో దేశాలు తమతో కలిసి రావడం లేదని తీవ్రస్థాయిలో ఫైర్
వాషింగ్టన్: పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ దెబ్బకు ఇరాన్ నౌకాదళం నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. సోమవారం సాయంత్రం 7:30 గంటల (ఐఎస్టీ) నుంచి హార్మూజ్ దిగ్బంధం అమలులోకి వచ్చిందని ప్రకటించారు.
ఇదే సమయంలో అమెరికాకు సహకరించని నాటో దేశాలపైనా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం మేరీల్యాండ్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ విమానం దిగిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ సైనిక శక్తిని అమెరికా పూర్తిగా తుడిచిపెట్టేసిందని పేర్కొన్నారు. ‘‘వారి సైన్యం నాశనమైంది. ఇరాన్ నౌకాదళం మొత్తం ఇప్పుడు నీటి అడుగున ఉంది. దాదాపు 158 నౌకలు గాలిలో కలిసిపోయాయి. వారి వద్ద ఉన్న మైన్ డ్రాపర్లు కూడా ఖతమైపోయాయి” అని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు సాయంత్రం 7:30 గంటల నుంచి అంతర్జాతీయ చమురు దిగ్బంధనాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ఇకపై చమురు విక్రయించకుండా ఇతర దేశాలు కూడా సహకరిస్తున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాల నౌకలు ఇప్పుడు చమురు కోసం అమెరికాకు వస్తున్నాయని, ఇంధన రంగంలో అమెరికా స్వయం సమృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
- నాటో తీరుపై ఆగ్రహం
అమెరికా రక్షణ కవచంగా ఉన్న నాటో కూటమి.. ఇరాన్‌తో యుద్ధ సమయంలో తమకు అండగా నిలవలేదని ట్రంప్ విమర్శించారు. నాటో కోసం అమెరికా ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నదని, అయితే అవసరమైనప్పుడు వారు కనిపించలేదని మండిపడ్డారు. దీనిపై తీవ్రస్థాయిలో సమీక్ష జరుపుతామని హెచ్చరించారు. ఇరాన్‌పై ఆపరేషన్ సమయంలో నాటో దేశాలు నౌకాదళ మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయని ట్రంప్ గుర్తుచేశారు.
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అమెరికా బాంబర్ల కోసం తమ గగనతలాన్ని మూసివేశారని, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇజ్రాయెల్ విమానాలకు అనుమతి నిరాకరించారని పలు నివేదికలు వెల్లడించాయి. దీంతో గత వారం నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటేతో ట్రంప్ సమావేశమయ్యారు. ‘‘మీ కోసం మీరు పోరాడటం నేర్చుకోండి.. అమెరికా ఇకపై మీకు సహాయం చేయదు” అని వారిని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పందిస్తూ.. యూరోపియన్ నాటో కొత్త రూపు సంతరించుకుంటోందని, భవిష్యత్తులో ఈ కూటమి వ్యూహాలు మారతాయని ప్రకటించారు.

