డజన్ల మందిని పిట్టల్లా కాల్చేశారు.. మయన్మార్ ఘటనపై యూఎన్ ఫైర్

డజన్ల మందిని పిట్టల్లా కాల్చేశారు.. మయన్మార్ ఘటనపై యూఎన్ ఫైర్

నేపిటా: మయన్మార్‌‌లో ఆర్మీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న పౌరులపై అక్కడి సైన్యం విరుచుకుపడుతోంది. ప్రశాంతంగా నిరసనలు చేస్తున్న ప్రజలపై ఆర్మీ కాల్పులకు దిగింది. శనివారం జరిగిన ఈ ఘటనలో 114 మంది నిరసనకారులు చనిపోయారు. ఈ ఘటన కూడా ఆర్మీ డే రోజున జరగడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మయన్మార్ చరిత్రలో ఇది రక్తపాతంతో తడిసిన రోజని విదేశీ మీడియా కథనాలను వెలువరించింది. ఈ ఘటనపై యూఎన్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రక్తపాతంపై అంతర్జాతీయ సమాజం వేగంగా స్పందించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకే రోజు శాంతియుతంగా నిరసనలు చేస్తున్న డజన్ల కొద్దీ ప్రజలను మిలటరీ పిట్టల్లా కాల్చిపారేసిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యూఎన్ స్పష్టం చేసింది. ఈ రక్తపాతాన్ని వెంటనే ఆపాలని, ఆ దిశగా ప్రపంచదేశాలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది.