కష్టకాలంలో హాస్పిటల్ కట్టడమే ముఖ్యం: వలస కూలీలు

కష్టకాలంలో హాస్పిటల్ కట్టడమే ముఖ్యం: వలస కూలీలు
  • ఇళ్లకు వెళ్లకుండా హాస్పిటల్‌ కన్‌స్ట్రక్షన్‌
  • ముంబైలో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం

ముంబై: కరోనా లాక్‌డౌన్‌ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని వేలాది మంది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతుంటే ముంబైలో కొంత మంది కార్మికులు మాత్రం హాస్పిటల్‌ను నిర్మించే పనుల్లో ఉన్నారు. ఈ కష్టకాలంలో హాస్పిటళ్లు నిర్మించడం చాలా అవసరం అని, అందుకే ఇబ్బందులు ఉన్నా పనులకు పోతున్నామని చెప్పారు. ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో స్పెషల్‌ కరోనా హాస్పిటల్స్‌, ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. కన్‌స్ట్రక్షన్‌ పనిలో పాల్గొనేందుకు దాదాపు 50 మంది వలస కూలీలను అక్కడే ఉంచేశారు. బంద్రా కుర్లా కాంప్లక్స్‌ ఆఫ్‌ ముంబైలో 1000 పడకల హాస్పిటల్ నిర్మాణానికి పనిచేస్తున్నారు. “ మాకు ఇళ్లకు వెళ్లిపోవాలని ఉంది. రెండు నెలల నుంచి పనులు లేవు. దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. కానీ ఈ కష్టకాలంలో హస్పిటల్‌ కట్టడం చాలా అవసరం . అందుకే ముందు పని పూర్తి చేసి ఆ తర్వాత ఇళ్లకు వెళ్తాం”అని బీహార్‌‌కు చెందిన వలస కార్మికుడు ఒకరు చెప్పారు. “నేను రెండుసార్లు రిక్వెస్ట్‌ పెట్టుకుంటే రిజెక్ట్‌ అయింది. ఇంట్లో మా అమ్మ ఒక్కతే ఉంది. ఈ పని అయిపోయిన వెంటనే పర్మిషన్‌ తీసుకుని ఇంటికి పోతాను” అని మరో కూలీ చెప్పారు. కరోనా కాలంలో పనులు లేక తినేందుకు తిండి లేక చాలా మంది కూలీలు సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. చాలా మంది కాలినడకన ఇళ్లకు చేరుకున్నార. మరి కొంత మంది కోసం ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేసి తరలిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కన్‌స్ట్రక్షన్‌ పనులకు ఇబ్బందులు వస్తాయని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. దాని కోసం కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే వలస కూలీల తరలింపును నిలిపేసింది.