బతికున్న శిశువును చనిపోయాడని కవర్లో చుట్టిన ఆస్పత్రి సిబ్బంది

బతికున్న శిశువును చనిపోయాడని కవర్లో చుట్టిన ఆస్పత్రి సిబ్బంది

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రి సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. బతికున్న శిశువును కవర్లో చుట్టేసి, చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. నాలుగు గంటల పాటు కవర్లోనే ఉన్న శిశువు ఆతర్వాత కదలడం ప్రారంభించింది. శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చింతూరు మండలం నర్సింహాపురం గ్రామానికి చెందిన ముచ్చిక సునీత అనే ఆరు నెలల గర్భిణి పురిటి నొప్పులతో శుక్రవారం అక్కడి ఏరియా ఆసుపత్రికి వెళ్లింది. సీరియస్​గా ఉండడంతో డాక్టర్లు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్‍చేశారు. రాత్రి స్కానింగ్‍చేసి కవలల్లో ఓ శిశువు చనిపోయినట్లుగా గుర్తించారు. శనివారం ఉదయం 8.30 గంటలకు సర్జరీ చేశారు. ఆడ శిశువు చనిపోయింది. మగ శిశువు కూడా ఏడవక పోవడంతో ఇద్దరూ చనిపోయారని భావించి రెండు కవర్లలో చుట్టి కుటుంబసభ్యులకు ఇచ్చారు.

ఆస్పత్రిలో ఉన్న బాలింతకు భోజనం తెచ్చేందుకు వెళ్లిన వారు మధ్యాహ్నం 12 .30కు తిరిగివచ్చారు. ఒక కవర్​లో చుట్టిన మగశిశువు కదిలి.. ఏడుస్తున్నట్టు గుర్తించిన వారు బయటకు తీశారు. బతికున్నాడో.. లేదో సరిగా చూడకుండానే డాక్టర్లు చనిపోయినట్టు ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువును ఇంక్యుబేటర్‍లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆరునెలలకే శిశువు పుట్టిందని, సరైన సౌకర్యాలు లేకపోవడంవల్ల సరిగా గుర్తించలేకపోయామని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‍ డాక్టర్​ యుగంధర్​ చెప్పారు. సీరియస్​గా ఉన్నందున వరంగల్​కు వెళ్లాలని చెప్పినా గర్భిణి కుటుంబసభ్యులు వినలేదన్నారు. ఇందులో నిర్లక్ష్యం ఏమీలేదన్నారు. గిరిజన సంఘాల నాయకులు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‍కు ఫిర్యాదు చేశారు. ఏరియా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. శుక్రవారం కూడా డయాలసిస్‍కేంద్రంలో చికిత్సపొందిన బూర్గంపాడుకు చెందిన రోగి డాక్టర్లు తనపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని గొడవపడ్డాడు. రక్తశుద్ధి సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోగులకు వైరస్‍సోకే ప్రమాదం ఉంది.

For More News..

కోట్ల రూపాయల వద్దనుకుంటున్న సెలబ్రిటీలు

మా ప్రాణం తీసెయ్యండి.. వృద్ధ దంపతుల వేడుకోలు

ఐసీసీలో సత్తా ఉన్నోళ్లు లేరా?