వర్షాలు, వరదలపై.. అసెంబ్లీలో హీట్.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

వర్షాలు, వరదలపై.. అసెంబ్లీలో హీట్.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
  • రుణమాఫీతో కాంగ్రెస్ పార్టీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి: కేటీఆర్
  • కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతో ఆస్తి, ప్రాణ నష్టం తగ్గింది: ప్రశాంత్ రెడ్డి
  • భారీ వర్షాలే కానీ వరదలు రాలేదని కామెంట్​
  • వరదలపై కాకుండా విద్యుత్‌‌పై మాట్లాడాలని చెప్పడమేంది?: భట్టి
  • మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలి: రఘునందన్
  • ఫ్లడ్ పాలసీ తీసుకురావాలి: అక్బరుద్దీన్
  • అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యుల వాకౌట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసెంబ్లీలో చేపట్టిన చర్చ పొలిటికల్ హీట్‌‌ను రాజేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రంలో ఎంత పంట నష్టం జరిగిందో ఊహించుకుని మాట్లాడడం సరికాదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 15 లక్షల ఎకరాల్లోపంట నష్టం జరిగిందని కాంగ్రెస్ అంచనా వేసిందా అని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌‌పై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాలు, వరదలపై మాట్లాడకుండా ఉచిత విద్యుత్ అంశంపై మాట్లాడాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని భట్టి విమర్శించారు. సభలో కాసేపు బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు అధికారపక్షం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.

పంట నష్టంపై వాగ్వాదం

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై చర్చలో కాంగ్రెస్ తరఫున దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో సుమారు 15 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టపోయిన విషయాన్ని మీడియా రిపోర్టు చేసిందని.. తమ ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లు కూడా క్షేత్రస్థాయిలో లెక్కలు తీశారని చెప్పారు. ఎకరానికి రూ.10 వేలు నష్టం వేసుకున్నా.. 1,500 కోట్లు పంట నష్టానికే అవసరం అవుతాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసిందని, ఇవి దేనికి సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. 


గత యాసంగిలో పంట నష్టానికి సంబంధించి రూ.450 కోట్లకు గాను రూ.150 కోట్లు ఇచ్చి మిగతావి ఇవ్వలేదన్నారు. దీంతో వెంటనే కలుగజేసుకున్న మంత్రి కేటీఆర్.. సభలో వాస్తవాలు మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో ఎంత పంట నష్టం జరిగిందో ఊహించుకుని మాట్లాడడం సరికాదన్నారు. 15 లక్షల ఎకరాల పంట నష్టమైందని కాంగ్రెస్ అంచనా వేసిందా అని ప్రశ్నించారు. పూర్తిగా రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన తర్వాత కాంగ్రెస్​కు ఫ్యూజులు ఎగిరిపోయాయని, దీంతో ప్రభుత్వంపై ఏదో ఒక అంశంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు 3 గంటల పాటు ఉచిత విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ చెబుతోందని ఆరోపించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లి తన మనస్సులో మాటలను ప్రకటించారని అన్నారు. అసలు రాష్ట్రంలో రుతుపవనాలు లేట్‌‌గా రావడం మంచిదైందని, ఆ విషయంలో సంతోషించాలని చెప్పారు. ‘‘ఉచిత విద్యుత్‌‌పై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి. ధరణిని రద్దు చేస్తాం, దళారీ వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి  శ్రీధర్ బాబు మాట్లాడాలి” అని అన్నారు. తాను మాట్లాడేది పూర్తిగా వినకుండానే కేటీఆర్ స్పందించారని శ్రీధర్ బాబు అన్నారు. వరదల వల్ల జరిగిన నష్టం గురించి మీడియాలో వచ్చిన విషయాన్ని  ప్రస్తావించానని చెప్పారు. విద్యుత్ పై స్పీకర్ చర్చ పెడితే తప్పకుండా సమాధానం చెబుతామని చెప్పారు.  వర్షాలు, వరదలపై చర్చ జరుగుతున్నందున తాను  అదే అంశానికి పరిమితం అవుతానన్నారు.

3 గంటలే ఇస్తమని కాంగ్రెస్ చెప్పలేదు: భట్టి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబును మాట్లాడనీయకుండా మంత్రులు అడ్డుపడడాన్ని తప్పుబట్టారు. వర్షాలు, వరదలపై మాట్లాడకుండా రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై  మాట్లాడాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ను మూడు గంటలే ఇవ్వాలని ఎవరూ చెప్పలేదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ను ఇచ్చిన చరిత్ర తమ పార్టీదని గుర్తుచేశారు. ఈ సమయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ 3 గంటలు సరిపోతుందని రేవంత్ అన్నారని, స్పీకర్ అనుమతిస్తే వీడియోను ప్రదర్శిస్తామని చెప్పారు.

చెక్​డ్యామ్‌‌లపై మాటకు మాట

రాష్ట్రంలో చెక్ డ్యామ్‌‌ల నిర్మాణం శాస్త్రీయంగా లేదని శ్రీధర్ బాబు ఆరోపించారు. దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, తన నియోజకవర్గానికి వస్తే చూపిస్తానని చెప్పారు. దీంతో మరోసారి అడ్డుపడిన ప్రశాంత్ రెడ్డి.. చెక్ డ్యామ్ ల నిర్మాణంతో రైతులు కేసీఆర్‌‌‌‌కు పాలాభిషేకాలు చేశారని అన్నారు. ఏదో ఉపద్రవం వచ్చినప్పుడు కొంత నష్టం జరుగుతుందన్నారు. మంత్రి హరీశ్‌‌రావు జోక్యం చేసుకుంటూ.. రైతులకు ఉచిత విద్యుత్ వద్దని రేవంత్ చెప్పారని, చెక్ డ్యామ్ లు వద్దని శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారని అన్నారు. మరో కాంగ్రెస్ నేత ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు. అసలు కాంగ్రెస్ విధానం ఏమిటో చెప్పాలన్నారు. చెక్ డ్యామ్ లు కావాలంటే బీఆర్ఎస్ ను, వద్దంటే కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. దీంతో చెక్ డ్యామ్ లు వద్దని తాము చెప్పలేదని భట్టి అన్నారు. తాను అనని మాటలను అన్నట్టుగా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నిస్తున్నారని శ్రీధర్​బాబు అన్నారు. అశాస్త్రీయంగా చెక్ డ్యామ్ లు కట్టవద్దని కోరానని చెప్పారు.

వేల ఎకరాలు మునుగుతున్నయ్: రఘునందన్

వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌‌రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల పెద్దపల్లి, మంచిర్యాల తదితర జిల్లాల్లో వేల ఎకరాలు ఏటా ముంపునకు గురవుతున్నాయని, ఆయా భూములను ప్రభుత్వం సేకరించి రైతులను ఆదుకోవాలన్నారు. వరదల వల్ల ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు గృహలక్ష్మి స్కీమ్‌‌ కింద రూ.3 లక్షలు, అదనంగా మరో 3 లక్షలు ఇవ్వాలన్నారు. చనఖ కొరట ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. వరదల వల్ల పశువులు కొట్టుకుపోయి ఒక్కో రైతు లక్షల్లో నష్టపోయారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కొట్టుకుపోయిన పశువుల లెక్క తేల్చి, వాటి యజమానులకు పరిహారం చెల్లించాలని కోరారు.

హైద‌‌రాబాద్‌‌లో చెరువులు క‌‌బ్జా: అక్బరుద్దీన్

వ‌‌ర‌‌ద‌‌ల‌‌తో పంట‌‌, ప్రాణ న‌‌ష్టాల‌‌ను నివారించేందుకు ఫ్లడ్ పాలసీ తీసుకురావాలని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. హైద‌‌రాబాద్‌‌లోని రిజ‌‌ర్వాయ‌‌ర్లు, చెరువులు క‌‌బ్జాకు గురై కుచించుకుపోయాయ‌‌పి, కాంక్రీట్ జంగిల్‌‌లో నీళ్లు పోయే మార్గం లేక కాల‌‌నీల‌‌ను ముంచెత్తుతున్నాయ‌‌ని అన్నారు. హైద‌‌రాబాద్‌‌లోని 30 శాతం బిల్డింగ్‌‌లు డేంజ‌‌ర్ జోన్‌‌లో ఉన్నాయ‌‌ని ఆందోళ‌‌న వ్యక్తం చేశారు. మూసీలోకి సీవరేజీ వాట‌‌ర్ ను వ‌‌ద‌‌ల‌‌టాన్ని త‌‌ప్పుప‌‌ట్టారు.

కాంగ్రెస్ వాకౌట్

మంత్రి ప్రశాంత్‌‌రెడ్డి సమాధానంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు, ప్రజలకు ఎలా సాయం చేస్తరో ప్రభుత్వం చెప్పకపోవడంపై మండిపడ్డారు సర్కారు తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌‌ చేశారు.

44 మంది చనిపోయిన్రు: ప్రశాంత్‌‌రెడ్డి

భారీ వర్షాల సమయంలో సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, సూచనలతోనే ఆస్తి, ప్రాణ నష్టం తక్కువగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి అన్నారు. ఆకాశంలో చిల్లు పడ్డట్టు వర్షాలు పడ్డాయని, వరదలేమీ రాలేదని అన్నారు. 305 చెరువు కట్టలు తెగిపోయాయని చెప్పారు. మిషన్ కాకతీయ చేపట్టకపోయి ఉంటే, వేలల్లో చెరువులు తెగేవని, ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే భయంకరంగా ఉందన్నారు. వానల వల్ల  రాష్ట్రంలో 44 మంది చనిపోయారని తెలిపారు. రూల్స్‌‌ ప్రకారం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున చెల్లిస్తామని, అవసరమైతే మరో లక్ష ఎక్కువగా ఇస్తామని ప్రకటించారు. మృతుల్లో రైతులు ఉంటే, వారికి రైతు బీమాకు సంబంధించిన రూ.5 లక్షలు వస్తాయన్నారు. వరదల వల్ల 419 ఇండ్లు పూర్తిగా, 7,505 ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయన్నారు. పంట నష్టం అంచనా వేస్తున్నామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు, 50 వేలు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, కాంగ్రెస్ హయాంలో 3, 4 వేలకు మించి ఇవ్వలేదని ఆరోపించారు. డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ కింద కేంద్రం రూ.900 కోట్లు ఇచ్చినా.. వాటిని వాడుకోవడానికి అడ్డగోలు రూల్స్ అడ్డు వస్తున్నాయన్నారు. 2016 సెప్టెంబర్‌‌‌‌లో రూ.3,851 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే, రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గుజరాత్, యూపీకి వేల కోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. గుజరాత్‌‌లో వర్షం పడితే ఢిల్లీలో ఉన్న మోదీకి జలుబు చేస్తోందని ఎద్దేవా చేశారు. మంత్రి ఆరోపణలను బీజేపీ నేత రఘునందన్‌‌రావు ఖండించారు. రూ.550 కోట్లను కేంద్రం ఇచ్చిందన్నారు. దీంతో స్పీకర్ ఆయన మైక్‌‌ను కట్ చేశారు. గతేడాది వరదల వల్ల నష్టపోయిన రైతులకు రూ.450 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామని, అందులో రూ.150 కోట్లను చెల్లించామని మంత్రి ప్రకటించారు.

వరద బాధితులను ఆదుకోవాలి: సీతక్క

వరదల వల్ల ములుగు జిల్లాలో 15 మంది చనిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సభ దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలు, వరదలపై ముందే హెచ్చరించినా.. సకాలంలో స్పందించి హెలికాప్టర్ పంపించినా.. ప్రాణ నష్టాన్ని నివారించగలిగే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. జంపన్న వాగు పొంగడం వల్ల పొలాల్లోకి ఇసుక మేటలు వేసిందని, రాళ్లు తేలి పంట పొలాలు దెబ్బతిన్నాయ‌‌ని, దీని వల్ల వేల మంది రైతులు నష్టపోయారని అన్నారు. వాళ్లందరినీ ఆదుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో నివాస స్థలం కేటాయించి, ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.