పాలకొండ బైపాస్ పక్కన హోటళ్లు, చాయ్ దుకాణాలు రాత్రి ఒంటి గంట వరకు తెరిచే ఉంటున్నాయి. దీంతో నగరానికి చెందిన యువత పెద్ద మొత్తంలో ఈ ప్రాంతానికి చేరుకొని టైం పాస్ చేస్తున్నారు. రాత్రి 9 దాటాకా.. బైక్‌లు వేసుకొని బైపాస్ ఎక్కుతున్నారు. సైలెన్సర్ల నుంచి భయంకరమైన శబ్దాలు చేస్తూ బైక్ రేసింగ్‌లు పెట్టుకుంటున్నారు. మరికొందరు అక్కడక్కడా ఉన్న కల్వర్టుల వద్ద కూర్చొని సిగరెట్లు తాగుతూ వచ్చి పోయే వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొందరు బైపాస్ వెంట ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లను సిట్టింగుల కోసం వినియోగించుకుంటున్నారు.
ౌగత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేయడం లేదని అంటున్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ జరుగుతున్నా నామ్‌కే వాస్తేగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.
ఓపెన్ కాక ముందే యాక్సిడెంట్లు
మహబూబ్‌నగర్–-చించోలి హైవేను కలుపుతూ నగరంలో కొత్తగా బై పాస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బైపాస్ పనులు ఇంకా పూర్తి కాలేదు. కొంత భాగం మిలిగి ఉంది. అయితే వాహనదారులు మాత్రం ఈ మార్గంలో ప్రయాణాలు చేస్తున్నారు. కర్నాటక, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు.. ఈ మార్గంలో 120 నుంచి 140 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తున్నాయి.
ఇటీవల ఈ మార్గంలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కొద్ది రోజుల కిందట వీరన్నపేట బైపాస్ నుంచి జీప్ యూ టర్న్ తీసుకుంటుండగా.. అటు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రాంతంలో రెండు వారాల కింద ఆటోను జీపు ఢీకొట్టడంతో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు.
