గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి..నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో ప్రమాదం

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి..నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో ప్రమాదం
  •     మృతుల్లో కానిస్టేబుల్, అతడి ఫ్రెండ్

 నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ తో పాటు అతడి ఫ్రెండ్ చనిపోగా, మరో యువకుడు గాయపడ్డాడు. ఈ ప్రమాదం నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కమ్మరెడ్డి పల్లి గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జగన్ (26) తెలకపల్లిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

 బుధవారం రాత్రి జగన్ తన ఫ్రెండ్స్ భీముడు (26), బాలశివతో కలిసి బైక్ పై తెలకపల్లి వైపు వెళ్తున్నారు. కమ్మరెడ్డి పల్లి గేటు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఎదురుగా ఢీకొట్టింది. జగన్, భీముడు అక్కడికక్కడే చనిపోగా బాలశివ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన బాలశివను హైదరాబాద్ కు తరలించారు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి నాగర్ కర్నూల్ హాస్పిటల్ కు వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు.