హైదరాబాద్, వెలుగు: అల్పాదాయ (ఎల్ఐజీ) వర్గాల కోసం హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా కేటాయించిన వివిధ ప్రాంతాల్లోని ఫ్లాట్లకు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలీ ప్రాంతంలోని వివిధ అపార్ట్ మెంట్ లలో ఉన్న 111 ఫ్లాట్ల కోసం 2,685 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో ఫ్లాటుకు 25 మంది పోటీ పడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో నిర్మించిన ఫ్లాట్లను ఎల్ఐజీ వర్గాలకు విక్రయించడానికి, ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ హౌసింగ్ బోర్డు గత నెల 16న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 3న సాయంత్రం వరకు మొత్తం 3,096 దరఖాస్తులు వచ్చాయి.
6న హైదరాబాద్, 8న వరంగల్, 10న ఖమ్మం ప్రాంతంలోని ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ సోమవారం తెలిపారు. లాటరీ ప్రక్రియ చూడటానికి దరఖాస్తు దారులు రావద్దని, ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనూ, యూట్యూబ్ ద్వారా లైవ్ ఇస్తున్నట్లు ఎండీ తెలిపారు. https://www.youtube.com/live/gCBIRWz8qt0 యూట్యూబ్ లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చన్నారు.
