చావుకు టికెట్ కొనుక్కున్నారా వాళ్లు..? బ‌స్సు సజీవ ద‌హ‌నంలో అసలేం జ‌రిగింది..? 

చావుకు టికెట్ కొనుక్కున్నారా వాళ్లు..? బ‌స్సు సజీవ ద‌హ‌నంలో అసలేం జ‌రిగింది..? 

మహారాష్ట్రలో బస్సు ప్రమాదం ఎలా జరిగింది..? ముగ్గురు పిల్లలతో సహా 25 మంది సజీవ దహనం కావడం తీవ్రంగా కలిచి వేస్తోంది. రన్నింగ్ లో ఉండగానే బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. డ్రైవర్ తో సహా8 మంది మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు బస్సు ప్రమాదం షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ప్రమాదం జరిగిన సమయం అర్థరాత్రి కావడం.. దాదాపు ప్రయాణికులందరూ పడుకోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేలోపే పెను ప్రమాదం జరిగింది. రన్నింగ్ నే బస్సులో మంటలు చెలరేగి.. 25 మంది సజీవదహనమయ్యారు. 

అసలేం జరిగింది..? 

బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది (ముగ్గురు పిల్లలతో సహా 25 మంది) ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్​నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం (జులై 1న) వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. టైర్‌ పేలి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 

మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు డ్రైవర్‌తో సహా క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని బుల్దానా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ కడసానే తెలిపారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, సీఎం షిండే 

బస్సు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని బుల్దానా ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించడానికే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి షిండే వైద్యాధికారులను ఆదేశించారు. 

ఈ ఘ‌ట‌న‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ స్పందించారు. ఒక‌వేళ అవ‌స‌రం అయితే కాలిపోయిన శ‌రీరాల‌ను డీఎన్ఏ ప‌రీక్షల ద్వారా గుర్తిస్తామ‌ని అన్నారు. రోడ్డు నిర్మాణం వ‌ల్ల ప్రమాదం జ‌ర‌గ‌లేద‌న్నారు. ప్రమాదం జ‌రిగిన ప్రదేశాన్ని సీఎం ఏక‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ పరిశీలించనున్నారు. ప్రమాదంలో గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు.