నోటీసులివ్వకుండా గోడ ఎట్ల కూలుస్తరు

నోటీసులివ్వకుండా గోడ ఎట్ల కూలుస్తరు

తప్పు ఒప్పుకున్న కమిషనర్.. గోడను తిరిగి నిర్మిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: నోటీసులు ఇవ్వకుండా వృద్ధుడి ఇంటి గోడను కూల్చడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అది అక్రమ స్థలంలో నిర్మించిన గోడ అని, దీనికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ వద్ద ఏజీ కాలనీకి సమీపంలోని మూసాపేట నాలా పనుల కోసం తన ఇంటి గోడను బల్దియా అధికారులు కూల్చేశారని 80 ఏండ్ల హబీబ్‌‌‌‌‌‌‌‌ అల్లాదీన్‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో రిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయడంతో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీకి కోర్టు నోటీసులిచ్చింది. దీనిపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని బల్దియా కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోకేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు ఇవ్వకపోయినా ఆయన విచారణకు వచ్చారు. తప్పు జరిగిందని, పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోడను కూల్చడం పొరపాటేనని కోర్టులో ఒప్పుకున్నారు. తిరిగి గోడను నిర్మిస్తామని చెప్పారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ మాధవీ దేవి స్పందిస్తూ.. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ దాఖలు చేసిన కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పిటిషనర్‌‌‌‌‌‌‌‌కు సంబంధం లేని జాగాలో గోడ నిర్మించారని, దీనికి పరిహారం  చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి.. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎట్లా చెబుతున్నారని ప్రశ్నించారు. హైకోర్టులో చెప్పిన విషయాలను రాతపూర్వకంగా అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని, గోడ తిరిగి నిర్మించిన వివరాలను కూడా నివేదించాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత రిట్‌‌‌‌‌‌‌‌పై విచారణను ముగిస్తున్నట్లు వెల్లడించారు.