రేట్లు ఎంత తగ్గినయ్..? ఆన్లైన్ ప్లాట్‌‌‌‌ఫామ్స్, షోరూంలలో జీఎస్టీ కట్‌‌‌‌పై జనం ఆరా

రేట్లు ఎంత తగ్గినయ్..? ఆన్లైన్ ప్లాట్‌‌‌‌ఫామ్స్, షోరూంలలో జీఎస్టీ కట్‌‌‌‌పై జనం ఆరా
  • పాతరేట్లను పోల్చుకొని వస్తువుల కొనుగోలు
  • శ్లాబుల తగ్గింపుతో ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్‌‌‌‌‌‌‌‌, ఆటోమొబైల్స్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌కు ఊపు
  • పట్టణాలు, సిటీలో కిటకిటలాడుతున్న షోరూంలు
  • దసరా, దీపావళితో నెలాఖరు వరకు కొనుగోళ్ల జోష్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు:  జీఎస్టీ శ్లాబుల తగ్గింపు అమల్లోకి రావడంతో ఆన్‌‌‌‌లైన్, ఆఫ్‌‌‌‌లైన్ మార్కెట్లలో సేల్స్​ ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్‌‌‌‌, ఆటోమొబైల్స్ లాంటి వస్తువులపై పన్నులు తగ్గడంతో వినియోగదారులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌‌‌‌లైన్ వెబ్‌‌‌‌సైట్స్‌‌‌‌ ఈ తగ్గింపు ధరలను తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలో స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయి. షోరూమ్‌‌‌‌లలో కూడా తగ్గింపు రేట్లను డిస్‌‌‌‌ ప్లే చేస్తున్నారు. దీంతో కస్టమర్లు వస్తువులను చూసి.. పాత రేట్లతో పోల్చుకుని కొంటున్నారు.  దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మరో 15 రోజుల వరకు కొనుగోలు జోష్‌‌‌‌ ఉంటుందని వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ జీఎస్టీ తగ్గింపులు వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచుతాయని భావిస్తున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అంటున్నారు.

తెలుసుకొని కొంటున్నరు..

తగ్గించిన జీఎస్టీ శ్లాబులు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో.. ‘ఏవి తగ్గాయి ? ఏవి పెరిగాయి’ అని తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అటు షోరూంలు, ఇటు ఆన్​లైన్‌‌‌‌లోనూ పాత రేట్లతో చెక్​ చేసుకుంటూ కొనుగోళ్లు చేస్తున్నారు.  కొత్తగా జీఎస్టీ రేట్లు తగ్గించిన వస్తువుల జాబితాలో లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ ఎక్కువగా ఉన్నాయి. నిత్యావసర వస్తువులైన పప్పులు, నూనెలు, గోధుమలులాంటి వాటిపై పన్ను శ్లాబుల్లో పెద్ద మార్పు లేదు. అందువల్ల ఈ వస్తువుల ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించడం లేదు. ప్యాకేజ్డ్ ఉత్పత్తులకు మాత్రం కొద్దిగా తేడా ఉంది.  పాలు, పండ్లు, కూరగాయలులాంటి ప్రాథమిక ఆహార వస్తువులు మొదటి నుంచి జీఎస్టీ పరిధిలోకి రాలేదు. కాబట్టి వీటి ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదు.  గతంలో, లగ్జరీ ఎలక్ట్రానిక్స్‌‌‌‌పై 28% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు ఆ శ్లాబును 18% లేదా అంతకంటే తక్కువకు మార్చారు. దీనివల్ల టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్‌‌‌‌ ఫోన్ ధరలు బాగా తగ్గాయి. గృహోపకరణాలపై ఉన్న పన్నులు కూడా తగ్గాయి.  ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు లాంటి వస్తువులపై 10 శాతం జీఎస్టీ తగ్గింది. ఈ తగ్గింపుల వల్ల వినియోగదారులు అధిక ధరల గురించి ఆలోచించకుండా.. వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. 

సిమెంట్, ఐరన్​ రేట్లపై డైలమా 

 కిరాణా సామాగ్రి, డ్రై ఫ్రూట్స్, సోప్స్, షాంపులాంటి కాస్మోటిక్స్ ఇంకా పాత ధరలకే అమ్ముతున్నారు. తమ వద్ద ఉన్న పాత స్టాక్‌‌‌‌ను పాత రేట్లకే అమ్ముతున్నట్లు షాపుల యజమానులు చెప్తున్నారు. అలాగే జీఎస్టీ శ్లాబ్‌‌‌‌ల సవరణతో సిమెంట్, ఐరన్ రేట్లు  తగ్గుతాయని భవన నిర్మాణదారులు ఆశలు పెట్టుకున్నారు. కానీ షాపుల్లో తగ్గిన రేట్లు ఇంకా అమలు కావట్లేదు.  పాత స్టాక్​ అయిపోయిన తర్వాత కొత్త స్టాక్‌‌‌‌కు కొత్త జీఎస్టీ అమలు చేస్తామని కొందరు చెబుతున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రముఖ డెయిరీ తమ నెయ్యి, పనీర్​, టెట్రా ప్యాక్ తదితర పాల ఉత్పత్తులపై ఇంకా రేట్లు తగ్గించలేదు.

షోరూమ్‌‌‌‌లకు పెరిగిన రద్దీ..     

చిన్న కార్లు, మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింది.  ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను 12% నుండి 5%కి తగ్గించారు. జీఎస్టీ సవరణలతో కార్ల ధరలు మోడల్‌‌‌‌ను బట్టి రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు, మోటార్ బైక్స్ రేట్లు రూ.7 వేల నుంచి రూ.20 వేల వరకు, అలాగే మోడల్‌‌‌‌ను బట్టి ఇతర వెహికల్స్‌‌‌‌ ధరలు కూడా భారీగా తగ్గాయి.  జీఎస్టీ సవరణలతో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి రేట్లు తగ్గుతాయని తెలిసినప్పటి నుంచి గత  నెల రోజులు వెహికిల్స్ బిజినెస్ అమాంతం పడిపోయిన విషయం తెలిసిందే. కానీ సోమవారం నుంచి ఒక్కసారిగా బుకింగ్స్, డెలీవరీలు పెరగడంతో డీలర్లు, షాపుల ఓనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.