రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ఇండ్ల మధ్యన పబ్‌‌ల నిర్వహణకు ఎలా అనుమతిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నివాస ప్రాంతాల మధ్య పబ్‌‌లు నిర్వహిస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారు? ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందజేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌‌ కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేసింది. పబ్‌‌లకు పర్మిషన్లు ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారు? పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, లైసెన్స్, ఇతర అన్ని రూల్స్ అమలు చేశారా? నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చర్యలు తీసుకున్నారు? చెప్పాలని పోలీసులను సోమవారం హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ కన్నెగంటి లలిత ఆదేశించారు. 

పర్మిషన్లప్పుడే రూల్స్ పాటిస్తే సరిపోయేదిగా..   

నివాస ప్రాంతాల్లో పబ్‌‌ల వల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ గతంలో జూబ్లీహిల్స్‌‌ రెసిడెంట్స్‌‌ క్లీన్‌‌ అండ్‌‌ గ్రీన్‌‌ అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్‌‌ వెంకట రమణ సూర్యదేవర ఒక పిటిషన్, జూబ్లీ హిల్స్‌‌ హౌసింగ్‌‌ సొసైటీకి చెందిన సుభాష్‌‌రెడ్డితో పాటు మరో ఐదుగురు పిటిషన్ వేశారు. వీటిని ఇదివరకు విచారించిన జస్టిస్‌‌విజయ్‌‌సేన్‌‌రెడ్డి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని పబ్‌‌లకు నోటీసులు కూడా ఇచ్చారు. రూల్స్‌‌ ఉల్లంఘించే పబ్స్ పై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు కౌంటర్‌‌ పిటిషన్‌‌లో తెలిపారు.