స్వాతంత్ర్య ఉద్యమానికి శ్రీకారం.. కాంగ్రెస్ ఆవిర్భావం

స్వాతంత్ర్య ఉద్యమానికి శ్రీకారం.. కాంగ్రెస్ ఆవిర్భావం
  • భారత  రాజకీయ చరిత్రలో డిసెంబర్ 28 ఒక విశిష్టమైన మైలురాయి. 
  • 1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించడంతో... 

 భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక క్రమబద్ధమైన రాజకీయ పునాది ఏర్పడింది.  విదేశీ పాలనలో అణచివేతకు గురైన  భారతీయుల ఆకాంక్షలను ఒక జాతీయ స్వరంగా మార్చిన సంస్థగా కాంగ్రెస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.  భారత  ప్రజాస్వామ్య ఆవిర్భావానికి, స్వేచ్ఛా ఉద్యమ విజయానికి మూలస్తంభంగా నిలిచిన ఈ సంస్థ ప్రయాణం,  నేటి భారత రాజకీయాల వరకూ విస్తరించింది. 

19వ శతాబ్దం చివరినాటికి బ్రిటిష్ పాలన భారతదేశాన్ని తీవ్రమైన ఆర్థిక దోపిడీకి గురిచేసింది. వ్యవసాయంపై భారమైన పన్నులు, దేశీయ పరిశ్రమల నాశనం, భారతీయులకు ప్రభుత్వ పరిపాలనలో పరిమిత అవకాశాలు ప్రజల్లో అసంతృప్తిని రగిలించాయి. అయితే ఆ అసంతృప్తి సంఘటిత రూపం దాల్చడానికి ఒక వేదిక అవసరమైంది. 

ఈ అవసరాన్ని గుర్తించిన ఆలన్ ఆక్టావియన్ హ్యూమ్ ప్రయత్నాలు, భారతీయ మేధావుల సహకారంతో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దారితీశాయి. 1885 డిసెంబర్ 28న ముంబైలోని  గోకులదాస్  తేజ్‌పాల్  సంస్కృత కళాశాలలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశానికి దేశ నలుమూలల నుంచి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇదే భారత రాజకీయ చైతన్యానికి తొలి అధ్యాయం.

జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యం

ప్రారంభ దశలో  కాంగ్రెస్  రాజ్యాంగపరమైన మార్గాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వినతులు సమర్పించే సంస్థగానే కనిపించినా,  దాని అంతర్లీన లక్ష్యం భారతీయులలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే.  దాదాభాయ్ నౌరోజీ ప్రతిపాదించిన ‘డ్రెయిన్ థియరీ’ ద్వారా భారత సంపద ఏటా ఇంగ్లాండ్‌కు ఎలా తరలిపోతోందో గణాంకాలతో వివరించడంతో, స్వాతంత్ర్య ఉద్యమానికి మేధోపరమైన పునాది ఏర్పడింది. మితవాద దశలో శాంతియుత రాజకీయ పోరాటం కొనసాగగా, 1905లో  బెంగాల్ విభజనతో కాంగ్రెస్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. 

స్వదేశీ ఉద్యమం, బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ దేశవ్యాప్తంగా వ్యాపించాయి. బాల గంగాధర్ తిలక్ ప్రతిపాదించిన స్వరాజ్య భావన ప్రజల్లో రాజకీయ ఆత్మగౌరవాన్ని పెంచింది.  మహాత్మా గాంధీ  ప్రవేశంతో  కాంగ్రెస్ ఒక ఎలైట్ వేదిక నుంచి ప్రజా ఉద్యమంగా మారింది. అసహకార ఉద్యమం,  సివిల్  డిసొబిడియన్స్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం కోట్లాదిమందిని ఉద్యమబాట  పట్టించాయి.  

ఈ  సుదీర్ఘ పోరాట ఫలితంగా 1947లో  స్వాతంత్ర్యం సిద్ధించింది.  అనంతరం కాంగ్రెస్ పార్టీ  దేశ పాలన బాధ్యతలను చేపట్టి, ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేసింది.  నెహ్రూ నేతృత్వంలో పారిశ్రామికీకరణ, శాస్త్రీయ దృక్పథం, విద్యా విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చి, రాజ్యాంగ విలువల ఆధారంగా పాలనసాగింది.

దేశ రాజకీయాల్లో ప్రధాన శక్తి

స్వాతంత్ర్యానంతరం మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా కొనసాగింది. అయితే,  కాలక్రమేణా సామాజిక మార్పులు, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, కూటమి రాజకీయాలు కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాల్ చేశాయి. 1984లో  అపూర్వమైన  మెజారిటీ  సాధించిన కాంగ్రెస్, ఆ తర్వాతి దశలో  పాలనాపరమైన విమర్శలు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ సంక్షోభాలతో  రాజకీయంగా బలహీనపడింది. 2004లో యూపీఏ ప్రభుత్వంతో  పునరాగమనం చేసినా, 2014 తర్వాత జాతీయ రాజకీయాల్లో  కేంద్రస్థానాన్ని కోల్పోయింది.

 నేటి భారత రాజకీయ పరిస్థితుల్లో

కాంగ్రెస్  ఒక  కీలక మలుపులో  నిలిచింది.  ఒకవైపు బలమైన అధికార పార్టీ ఆధిపత్యం, మరోవైపు  మారుతున్న  ఓటరు  మనస్తత్వం,  యువత  ఆకాంక్షలు  కాంగ్రెస్  ముందు  కొత్త సవాళ్లుగా నిలుస్తున్నాయి.  సంస్థాగత  బలహీనత,  స్పష్టమైన  నాయకత్వ  ప్రతిభ లోపించడం,  ప్రాంతీయ స్థాయిలో నాయకత్వ విభేదాలు  పార్టీ  పునరుద్ధరణకు ఆటంకాలుగా మారాయి.  అదే  సమయంలో రాజ్యాంగ విలువలు, లౌకికతత్వం,  సమాఖ్య వ్యవస్థ  పరిరక్షణ వంటి అంశాల్లో  కాంగ్రెస్ పాత్రపై  ఒక వర్గం  ప్రజల్లో మళ్లీ ఆశలు పునరుద్భవిస్తున్నాయి. వీటిని నెరవేర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి.

కాంగ్రెస్ ​తన చారిత్రక బాధ్యతను గుర్తుంచుకోవాలి

ప్రస్తుత  పరిస్థితుల్లో  కాంగ్రెస్ ముందున్న అసలైన పరీక్ష.. తన చారిత్రక వారసత్వాన్ని ఆధునిక రాజకీయ అవసరాలతో అనుసంధానించడం.  కేవలం స్వాతంత్ర్య ఉద్యమ పార్టీ  అనే  గుర్తింపుతోనే  కాకుండా,  సమకాలీన ఆర్థిక, సామాజిక  సమస్యలకు  స్పష్టమైన  ప్రత్యామ్నాయ విధానాలు  ప్రతిపాదించాల్సిన  అవసరం ఉంది.  

నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం,  సామాజిక  అసమానతలు,  సమాఖ్య హక్కులు వంటి అంశాలపై ప్రజలను విశ్వసింపజేసే రాజకీయ కార్యాచరణ రూపొందించడమే పార్టీ పునరుజ్జీవనానికి మార్గం.  కాంగ్రెస్  వ్యవస్థాపక దినోత్సవం నేటి రాజకీయ పరిస్థితుల్లో ఒక ఆత్మపరిశీలన దినంగా మారాలి. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఏ విధంగా సంఘటితం చేసిందో,  అదే రీతిలో  నేటి ప్రజాస్వామ్య సవాళ్లను  ఎదుర్కొనే  ధైర్యం, దృష్టి అవసరం.  

భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన పార్టీగా, కాంగ్రెస్ తన చారిత్రక బాధ్యతను గుర్తుంచుకుని,   కాలానుగుణంగా మారగలిగితేనే  నేటి రాజకీయాల్లో తన ప్రాధాన్యాన్ని పునరుద్ధరించుకోగలదు. అప్పుడే కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం ఒక జ్ఞాపక దినంగా కాక,  ఒక  కొత్త రాజకీయ ప్రయాణానికి సంకేతంగా నిలుస్తుంది. 

- రామకిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్