రూ.10 కోట్లు కూడబెట్టాలని ప్లాన్ చేస్తున్నారా..? నెలకు ఎంత ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలో లెక్క ఇదిగో..

రూ.10 కోట్లు కూడబెట్టాలని ప్లాన్ చేస్తున్నారా..? నెలకు ఎంత ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలో లెక్క ఇదిగో..

మనిషి తన జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడమంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా పదవీ విరమణ జీవితాన్ని గడపడం. దీనికోసం సరైన ప్లానింగ్, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు అవసరం. డిసెంబర్ 2025 లెక్కల ప్రకారం దేశంలో SIP పెట్టుబడులు రూ.31వేల 002 కోట్లకు చేరుకున్నాయి. ఇది ప్రస్తుతం భారతీయుల్లో మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహనను సూచిస్తోంది. కాంపౌండింగ్ పవర్ ద్వారా చిన్న మొత్తాలతో ప్రారంభించి కోట్లాది రూపాయల సంపదను ఎలా సృష్టించవచ్చో ప్రజలు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నట్లు ఈ ఇన్వెస్ట్మెంట్ ధోరణి చెబుతోంది. 

అయితే నెలవారీ పెట్టుబడి ద్వారా కోట్లలో రిటైర్మెంట్ కోసం కూడబెట్టడం ఎలా.. ఎంత కాలం పెడితే ఎంత వస్తుంది. దానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు 30 ఏళ్ల వయసులో ఉండి.. 60 ఏళ్ల రిటైర్మెంట్ నాటికి రూ.10 కోట్ల భారీ నిధిని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. నెలకు రూ.48వేల 090 SIP రూపంలో పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ పెట్టుబడిపై ఏడాదికి 10 శాతం రాబడిని తీసుకోవటం జరిగింది. అదే ఒకవేళ మీరు ఆలస్యంగా అంటే 45 ఏళ్ల వయసులో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తే.. అదే రూ.10 కోట్ల కార్పస్ టార్గెట్ చేరుకోవడానికి నెలకు ఏకంగా రూ.2లక్షల 48వేల 990 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఎంత తొందరగా పెట్టుబడి అలవాటును లేదా ప్లానింగ్ చేస్తున్నామనే టైమింగ్ మీకు వచ్చే రాబడి లెక్కలను ఎలా మార్చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

ఒకవేళ మీ టార్గెట్ రూ.కోటి పోగుచేయటం అయితే.. 30 ఏళ్ల కాలపరిమితికి నెలకు కేవలం రూ.7వేలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. కానీ ఇందులో వార్షిక 8 శాతం రాబడిని అంచనా వేయబడింది పెట్టుబడిపై. అదే ఈక్విటీ ఎక్స్‌పోజర్ పెంచి 12 శాతం రాబడిని ఇచ్చే సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే నెలకు కేవలం రూ.4వేల 800 ఇన్వెస్ట్మెంట్ తోనే కోటీశ్వరులు కావచ్చు. 

ఇక చివరిగా రూ.5 కోట్ల కార్పస్ కోసం సేవింగ్ చేయాలనుకునే 35 ఏళ్ల వ్యక్తి.. 25 ఏళ్ల పాటు నెలకు రూ.40వేల 200 ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ 10 శాతం రాబడి లెక్కించబడుతోంది. కానీ పెట్టుబడిపై 12 శాతం రాబడిని అందించే వాటిలో సిప్ చేస్తే నెలకు రూ.29వేల 300 దాచుకుంటే సరిపోతుంది. ఇక్కడ రాబడి ఎక్కువ ఉంటే పెట్టాల్సిన డబ్బు తగ్గిపోతోంది, కానీ ఇందులో రిస్క్ కూడా ఎక్కువేనని గుర్తుంచుకోవాలి ఇన్వెస్టర్లు.

కేవలం సంపదను సృష్టించడమే కాదు.. దానిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. పదవీ విరమణ దగ్గర పడే కొద్దీ రిస్క్ ఉన్న ఈక్విటీల నుంచి సురక్షితమైన పథకాలకు నిధులను మళ్లించాలి. మీ టేక్-హోమ్ శాలరీలో కనీసం 30 శాతం మొత్తాన్ని పెట్టుబడిగా మళ్లించడం ద్వారా మాత్రమే ఇలాంటి భారీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుంది. ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యమైనది వ్యక్తులు తమ వార్షిక సంపాదన ఖర్చులకు 30 నుండి 40 రెట్లు ఈ నిధి ఉండేలా చూసుకోవాలి.