టెన్త్ అయిపోయిన స్టూడెంట్లకు అడ్మిషన్లు ఎలా?

టెన్త్ అయిపోయిన స్టూడెంట్లకు అడ్మిషన్లు ఎలా?
  • టెన్త్‌‌‌‌లో 2 లక్షల మందికి 10 జీపీఏ.. అడ్మిషన్లు ఎట్లిద్దం?
  • తలలు పట్టుకుంటున్న బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీ అధికారులు
  • ఉన్న సీట్లు 1,500.. లక్ష మంది అప్లై చేసే చాన్స్
  • ఏటా టెన్త్ గ్రేడ్స్ ఆధారంగానే సీట్ల కేటాయింపు
  • పాలిసెట్‌ ద్వారా అడ్మిషన్లకే ఉన్నతాధికారుల మొగ్గు 

హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లపై అయోమయం నెలకొన్నది. టెన్త్ గ్రేడ్లు ప్రకటించి పదిరోజులైనా ఇప్పటికీ ప్రవేశాలు ఎలా చేయాలనే దానిపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు. ఈసారి టెన్త్ స్టూడెంట్లకు దాదాపు రెండు లక్షల మందికి పైగా స్టూడెంట్లకు 10 జీపీఏ గ్రేడ్లు రావడంలో, అడ్మిషన్ల ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. అయితే ఏపీలో మాదిరిగా ఎంట్రెన్స్ టెస్టు నిర్వహించాలా లేదా పాత పద్ధతిలోనే టెన్త్‌‌‌‌ గ్రేడ్స్ ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలా అనే దానిపై అధికారుల్లో చర్చలు నడుస్తున్నాయి. ఓ వైపు ఇంటర్ అడ్మిషన్లు మొదలైనా.. ఆర్జీయూకేటీలో ప్రవేశాలపై నోటిఫికేషన్ రాకపోవడంతో ట్రిపుల్‌‌‌‌ ఐటీ అడ్మిషన్లపై ఆశ పెట్టుకున్న విద్యార్థులు, పేరెంట్స్‌‌‌‌లో ఆందోళన నెలకొంది.

ఏటా టెన్త్ గ్రేడ్ల ఆధారంగా అడ్మిషన్
రాష్ట్రంలో బాసరలోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ)లో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. ఈ వర్సిటీలో ఏటా 1500 మంది స్టూడెంట్లకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. టెన్త్ విద్యార్థులకు వచ్చే మార్కులు, గ్రేడ్ల ఆధారంగా ఆ వర్సిటీలో ప్రవేశాలుంటాయి. అయితే గతేడాది నుంచి కరోనా తీవ్రత నేపథ్యంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో లాస్ట్ ఇయర్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా స్టూడెంట్లకు గ్రేడ్లు కేటాయించారు. ఆర్జీయూకేటీ ప్రారంభమైన 2008 నుంచి ఎన్నడూ పదివేల మందికి కూడా రాని టెన్ జీపీఏ స్కోర్.. రెండేళ్లుగా లక్షల్లో వస్తున్నాయి. దీంతో అధికారులు, సర్కారుకు సమస్యగా మారింది.

నిరుడు 40 రోజుల ప్రాసెస్‌‌‌‌..
2018లో 4,768 మంది టెన్త్ విద్యార్థులకు టెన్ జీపీఏ రాగా, 2019లో 8,676 మందికి వచ్చింది. 2020లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించడంతో ఏకంగా 1,41,383 మందికి టెన్​జీపీఏ వచ్చింది. అయితే నిరుడు పాత పద్ధతిలోనే అడ్మిషన్లు ఇచ్చిన యూనివర్సిటీ అధికారులు.. స్టూడెంట్లను ఫిల్టర్ చేసే ప్రాసెస్‌‌‌‌లో నానా తంటాలు పడ్డారు. ఆర్జీయూకేటీకి  45వేల మంది స్టూడెంట్లు అప్లై చేయడంతో గ్రూప్‌‌‌‌ సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్లు, వయసు, ఇలా రకరకాల కండిషన్లను పరిగణనలోకి తీసుకుని 40 రోజుల సుదీర్ఘ ప్రాసెస్‌‌‌‌ తర్వాత స్టూడెంట్లకు సీట్లు అలాట్ చేశారు.  ఈ ఏడాది(2021) ఎఫ్ఏ1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వగా ఏకంగా 2,10,647 మందికి టెన్​జీపీఏ వచ్చింది. నిరుటిలానే ఆర్జీయూకేటీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలంటే నెలల కొద్దీ టైమ్‌‌‌‌ పట్టే చాన్స్ ఉంది. దీంతో ఈసారి ఆల్టర్నేటివ్స్‌‌‌‌పై ఆలోచించాల్సి వచ్చింది. టెన్త్ రిజల్ట్ రాగానే బాసర ట్రిపుల్ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియపై విధి విధానాలతో నోటిఫికేషన్ ఇచ్చుందుకు ప్రక్రియ ప్రారంభించాలని వర్సిటీ అధికారులు, సర్కారుకు లేఖ రాశారు. అయితే ఇప్పటికీ సర్కారు నుంచి ఎలాంటి రిప్లై రాలేదు.

సర్కారు ఆర్డినెన్స్‌‌‌‌ ఇవ్వొచ్చు..
ఈ ఏడాది ఏకంగా రెండు లక్షల మంది పైగా టెన్త్ స్టూడెంట్లకు టెన్ జీపీఏ రావడంతో కనీసం లక్ష మంది ట్రిపుల్‌‌‌‌ ఐటీకి అప్లై చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో సీట్‌‌‌‌ అలాట్‌‌‌‌మెంట్ ప్రాసెస్‌‌‌‌ మార్చి.. ఎంట్రెన్స్ నిర్వహిస్తే మేలన్న భావనలో అధికారులు ఉన్నారు. అయితే ఆర్జీయూకేటీ యాక్ట్ ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు. ప్రస్తుత సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా చట్ట సవరణ చేయాలని సర్కారుకు కోరాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఇప్పట్లో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో సర్కారు ఆర్డినెన్స్  తీసుకువస్తే ఎంట్రెన్స్ నిర్వహించే వీలు కలుగుతుంది.

ఇంకా నిర్ణయం తీసుకోలె
ప్రస్తుతం పరిస్థితుల్లో ట్రిపుల్‌‌‌‌ఐటీ అడ్మిషన్లను పాలిసెట్‌‌‌‌ ద్వారా చేపట్టాలన్న అంశంపై చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది.
- రాహుల్ బొజ్జా,  ఆర్జీయూకేటీ ఇన్‌‌‌‌చార్జ్ వీసీ

పరిశీలనలో పాలిసెట్
ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్ వర్సిటీ, వెటర్నరీ వర్సిటీల్లో కొన్ని కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్‌‌‌‌ ద్వారానే ట్రిపుల్ఐటీ అడ్మిషన్లనూ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్​ మిట్టల్, ఆర్జీయూకేటీ ఇన్‌‌‌‌చార్జ్ వీసీ రాహుల్ బొజ్జా దీనిపై రెండు, మూడుసార్లు చర్చలు కూడా జరిపారు. ఇప్పటికిప్పుడు ఆర్జీయూకేటీ అడ్మిషన్లకు ప్రత్యేకంగా ఎంట్రెన్స్ నిర్వహించడం కష్టమని, పాలిసెట్‌‌‌‌ ద్వారా అడ్మిషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు చెప్పారు.