న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌కు ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ విమర్శలు చేశాడు. యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న మ్యాచ్ విన్నర్‌ను ఎలా తప్పిస్తారని సెలెక్టర్లపై ధ్వజమెత్తాడు. టీమ్‌లోకి రావడానికి జైస్వాల్ ఇంకా ఏం చేయాలని ప్రశ్నించాడు. ‘జైస్వాల్ మూడు ఫార్మాట్లలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని తప్పు లేకుండానే పదేపదే టీమ్ నుంచి తప్పిస్తున్నారు.
జైస్వాల్ కచ్చితమైన మ్యాచ్ విన్నర్. మిగతా ప్లేయర్లంతా నాణ్యమైన వాళ్లే అయినప్పటికీ జైస్వాల్ ఉంటే టీమ్ మరింత బలంగా ఉండేది. ఫామ్, ఫిట్‌నెస్ ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్‌ను తప్పించడం సరైందే. ఎందుకంటే అతను ఫామ్‌లో లేడు. గిల్ ప్లేస్‌లో జైస్వాల్‌ను తీసుకోవాల్సింది. ఎన్నోసార్లు జట్టుకు మంచి ఆరంభాలు అందించాడు. ఏ ఆటగాడినైనా ఒక ఫార్మాట్‌లో పదేపదే తప్పిస్తే ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. ఇది చాలా ప్రమాదకరం’ అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.
