ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్

ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటగా తీసుకున్న కమిషన్ ఘటనపై సమగ్రమైన నివేదికను అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. అక్టోబర్ 10 తేదీ లోపు నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

12మంది మహిళలు నిమ్స్ కు తరలింపు

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ కేసుల్లో మరికొంత మందికి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం హాస్పిటల్లో 18 మందికి డాక్టర్లు టెస్టులు చేశారు. ఇందులో 12 మందికి ఇబ్బందులు ఉండటంతో నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికే ఏడుగురిని అపోలో హాస్పిటల్ కు షిప్ట్ చేయగా..ఇందులో ఒకరు సీరియస్ గా ఉన్నారు.   

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై హెల్త్ డైరెక్టర్ వివరణ 

ఇబ్రహీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలైన ఘటనపై తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వివరణ ఇచ్చారు. 34 మంది మహిళలకు అనుభవం ఉన్న నిపుణులైన డాక్టర్లతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించామని చెప్పారు. దురదృష్టవశాత్తు నలుగురు మహిళలు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయిస్తోందని చెప్పారు. నలుగురు మహిళలు చనిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు.