బషీర్‌బాగ్, వెలుగు : మానవ హక్కుల ఉల్లంఘటన జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో ఓ ఎస్సైని కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించిన హెచ్‌ఆర్‌సీ.. మరో ఆఫీసర్ నుంచి వివరణ కోరింది. వివరాల్లోకి వెళ్తే... రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంథని ఎస్సై డేగల రమేశ్ ఓ కేసు విషయంలో సీలం రాజ్‌కుమార్ అనే వ్యక్తిని స్టేషన్‌కు పిలిచించాడు. తర్వాత రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో.. ఎస్సై వేధింపులు తట్టుకోలేకే అతడు సూసైడ్ చేసుకున్నట్లు సత్యనారాయణ అనే వ్యక్తి హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశాడు.
స్పందించిన చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణకు ఆదేశించారు. డిసెంబర్ 4న కమిషన్ ముందు హాజరుకావాలని ఎస్సై రమేశ్‌ను ఆదేశించింది. అలాగే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆఫీసర్ల వేధింపులతో లక్ష్మి రాజం అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని పోస్ట్ ద్వారా హెచ్‌ఆర్‌సీకి ఓ ఫిర్యాదు అందింది. దీంతో స్పందించిన కమిషన్ కరీంనగర్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సయ్యద్ ఖాదర్ నుంచి వివరణ కోరింది. డిసెంబర్11లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
