- మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు హెచ్ఆర్‌డీఏ లెటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న నియామకాల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్- నోటిఫికేషన్ 04/2025) స్పెషలిస్ట్ పోస్టుల కంటే ముందే.. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ- నోటిఫికేషన్ 03/2025) పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్‌డీఏ )డిమాండ్ చేసింది.
ఈ మేరకు శనివారం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచెస్ఆర్బీ) మెంబర్ సెక్రటరీకి సంఘం అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ నాగుల లేఖ రాశారు. చాలా మంది డాక్టర్లు ఈ రెండు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్నారని, ఒకవేళ ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే మెరిట్ ఉన్నవారు అటు వెళ్లిపోతారని తెలిపారు.
దీంతో సీఏఎస్ పోస్టులు మిగిలిన అర్హులైన అభ్యర్థులకు క్లియర్ గా అందుబాటులో ఉంటాయని సూచించారు. ఈ చర్యతో ఒకే వ్యక్తి రెండు పోస్టులకు ఎంపిక కావడం, సీట్లు వృథా కావడం, జాయినింగ్ సమయంలో గందరగోళం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా ఎలాంటి చిక్కులు రాకుండా ఉండాలంటే.. ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ల జాబితానే ఫైనల్ చేయాలని బోర్డును కోరారు.
