కాశ్మీర్​ను స్వర్గంలా మారుస్తాం

కాశ్మీర్​ను స్వర్గంలా మారుస్తాం
  • 370 రద్దు 130 కోట్ల మంది ఆకాంక్ష: ప్రధాని మోడీ
  • నాసిక్​లో ఎన్నికల ప్రచారం.. మహారాష్ట్ర మళ్లీ బీజేపీదేనని ధీమా
  • శివసేనపై ప్రధాని విమర్శలతో పొత్తుపై అనుమానాలు

నాసిక్​: దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని, ఎన్డీఏ సర్కారుకు నేషనల్​ సెక్యూరిటీనే ఫస్ట్​ ప్రయారిటీ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రజల మద్దతు ఎంత బలంగా ఉంటే ప్రభుత్వాలు కూడా అంతే బలమైన నిర్ణయాలు తీసుకుంటాయని, రెండో టర్మ్​లో 100 రోజుల పాలనే అందుకు నిదర్శనమన్నారు. జమ్మూకాశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అన్నింటికంటే కీలక నిర్ణయమని, టెర్రరిజం, హింస నుంచి అక్కడి ప్రజలకు విముక్తి కల్పించామని గుర్తుచేశారు.‘‘130 కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్క కాశ్మీరీని మనం గుండెలకు హత్తుకోవాలి. కాశ్మీర్​ను సరికొత్తగా, మళ్లీ స్వర్గంలా మారుస్తాం’’అని ప్రధాని తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో ఆశీర్వదించినట్లే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీని ఆశీర్వwదించాలని, సుస్థిర పాలన కోసం మరోసారి దేవేంద్ర ఫడ్నవిస్​ను సీఎంగా గెలిపించాలని కోరారు. ఫడ్నవిస్​ చేపట్టిన మహా ‘జన సందేశ్​ యాత్ర’ ముగింపు సందర్భంగా గురువారం నాసిక్​లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య​తిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేల కోట్లిచ్చామని, అందులో రూ.1500 కోట్లు మహారాష్ట్ర రైతులకు లభించాయని ప్రధాని గుర్తుచేశారు.

మందిరంపై మాటలెందుకు?

మహారాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న ప్రధాని మోడీ, స్థానిక పార్టీలైన ఎన్సీపీపై నేరుగా, శివసేనపై పరోక్షంగా మండిపడ్డారు. పాకిస్తాన్​ను పొగుడుతూ ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్ ఈమధ్య చేసిన కామెంట్లను మోడీ తప్పుపట్టారు. ‘‘కాశ్మీర్​ విషయంలో కాంగ్రెస్ పార్టీ​ కన్ఫ్యూజ్​ అయిందంటే ఒప్పుకుంటా, కానీ సీనియర్​ నాయకుడు పవార్​ కూడా పక్కదేశాన్ని పొగడటం నాకు ఆశ్చర్యం కల్గించింది. పాక్​ టెర్రరిస్టుల కార్ఖానా అని పవార్​కు తెలియదా?”అని మోడీ ప్రశ్నించారు. ఆర్టికల్​ 370ని రద్దు చేసినట్లే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కేంద్రం చట్టం చేయాలన్న శివసేన పార్టీ డిమాండ్​పైనా ప్రధాని ఘాటుగా స్పందించారు. ఉద్దవ్​ థాక్రే పేరెత్తకుండా.. ‘‘ఈ ప్రాంతానికి చెందిన కొంత మంది నేతలు పెద్ద నోరుంది కదాని మందిరం గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. అయోధ్య వివాదాన్ని కోర్టు విచారిస్తోందని వీళ్లకు తెలీదా, న్యాయవ్యవస్థను గౌరవించరా?”అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగాల బారినపడకుండా దేశంలోని 50 కోట్ల పశువులకు వ్యాక్సిన్లు వేయాలన్న నిర్ణయాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారన్న ప్రధాని.. ఆవులు, ఇతర పశువులు ఓటు వేయవు కదా అని కౌంటరిచ్చారు. అక్టోబర్​లో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నవేళ, ఉద్దవ్​ థాక్రేపై పరోక్షంగా ప్రధాని చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.