బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు
  • జులైలో హైదరాబాద్​ రానున్న ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా 
  • 18 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు,  జాతీయ నేతలు కూడా
  • ఇయ్యాల స్థల పరిశీలనకు రానున్న బీఎల్ సంతోష్  
  • పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం 
  • ప్రముఖుల బసకు హోటళ్లు, సమావేశాల వేదికల పరిశీలన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెలలో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హైదరాబాద్ వేదికగా క్యాడర్ ను సమాయత్తపర్చడాన్ని పార్టీ హై కమాండ్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. పార్టీ అగ్ర నేతలు పాల్గొనే ఈ భేటీ ద్వారా బహుళ ప్రయోజనాలు పొందాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సానుకూలంగా మలచుకుని అధికారం కైవసం చేసుకోవడం, దక్షిణాదిలో పార్టీని సంస్థాగతంగా విస్తరించడం ఈ వ్యూహంలో భాగమే! పార్టీలో వన్, టూ, త్రీ అనదగిన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 18 రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ కార్యవర్గ పదాధికారులు, వివిధ మోర్చాల అధినేతలు పాల్గొనే ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో పార్టీ శ్రేణుల్ని మరింత ఉత్తేజపర్చి, అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడం పార్టీ అగ్ర నాయకత్వం యోచనగా ఉంది. ఇందుకుగాను తగినంత ముందుగానే ఏర్పాట్ల పర్యవేక్షణ, రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశానికి పూనుకుంది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ బుధవారం హైదరాబాద్​కు వస్తున్నారు.  

సమావేశాలకు వెయ్యి మంది లీడర్లు  

వచ్చే నెలలో  జరిగే బీజేపీ సమావేశాల కోసం చేపట్టనున్న ఏర్పాట్లను బీఎల్ సంతోష్ పరిశీలించనున్నారు. తర్వాత రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కీలకమైన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ, అమిత్ షా, నడ్డాతో పాటు సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలంతా కలిపి సుమారు వెయ్యి మంది లీడర్లు హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో అగ్ర నేతలు, పలువురు ప్రముఖులు బస చేసేందుకు హోటళ్లు, సమావేశాల వేదిక వంటి వాటిపై రాష్ట్ర నేతలతో సంతోష్ చర్చించనున్నారు. మాదాపూర్‌‌‌‌లోని హెచ్ఐసీసీతోపాటు శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టుకు దగ్గరలో ఉండే పలు సభా స్థలాలను, ప్రముఖుల బస కోసం అక్కడి హోటళ్లను ఆయన పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. భద్రతాపరంగా పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఉండే హోటళ్లు, అన్ని రకాలుగా అనువైన పరిస్థితులు ఉండే సమావేశ స్థలంపై దృష్టి సారించనున్నారు.