చైన్ పడితే చదివింపులే .. ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో దందా

చైన్ పడితే చదివింపులే .. ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో దందా
  • రాష్ట్రవ్యాప్తంగా సర్వేయర్ల కొరత
  • 250 మండలాల్లో పోస్టులు ఖాళీ!
  • ఐదేండ్లుగా లైసెన్స్​డ్ సర్వేయర్లకు జీతాలు చెల్లించని సర్కారు

మంచిర్యాల, వెలుగు: సర్వే అండ్  ల్యాండ్​ రికార్డ్స్​డిపార్ట్మెంట్లో లైసెన్స్డ్ సర్వేయర్ల దందా నడుస్తోంది. రాష్ట్రంలోని చాలా మండలాల్లో రెగ్యులర్​సర్వేయర్​ పోస్టులు ఖాళీగా ఉండడంతో వారి స్థానంలో టెంపరరీగా లైసెన్స్డ్​ సర్వేయర్లను గత సర్కారు నియమించింది. కొన్నేండ్ల నుంచి ప్రభుత్వం ఎలాంటి జీతభత్యాలు చెల్లించకపోవడంతో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్​ భూములను సర్వే చేయాలంటే గవర్నమెంట్​కు ఫీజు కట్టడంతో పాటు సర్వేయర్లకు చదివింపులు తప్పనిసరన్న అభిప్రాయం నెలకొంది. లేదంటే రేపు మాపంటూ నెలల తరబడి తిప్పించుకోవడం పరిపాటిగా మారిందంటున్నారు. 

బీఆర్ఎస్ హయాం నుంచే..
ప్రభుత్వ, ప్రైవేట్​ భూముల కొలతల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక రెగ్యులర్  సర్వేయర్​ ఉండాలి. కానీ, గత ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా సర్వేయర్ల రిక్రూట్​మెంట్​ చేపట్టలేదు. ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయలేదు. మరోవైపు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, స్టేట్, నేషనల్​ హైవేలు, సింగరేణి ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున భూసేకరణ చేపట్టింది. అలాగే గవర్నమెంట్, సీలింగ్, ఫారెస్ట్​ ల్యాండ్స్​ సర్వే అవసరమైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్​ సర్కారు 2017లో లైసెన్స్​డ్ సర్వేయర్లను టెంపరరీగా నియమించింది. ఏడాది పాటు వారికి నెలకు రూ.12 వేల జీతం చెల్లించింది. 2019 నుంచి ఇప్పటివరకు ఐదేండ్ల నుంచి వారికి ఎలాంటి జీతభత్యాలు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 పోస్టులు ఖాళీ ఉండడంతో ఆయా మండలాల్లో లైసెన్స్​డ్ సర్వేయర్లను కంటిన్యూ చేస్తున్నారు. 

తెరవెనుక పనుల్లో కీలకం..
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు భూసేకరణలో సర్వేయర్ల పాత్ర కీలకంగా మారింది. వారి ఇచ్చే భూసర్వే రిపోర్టుల ఆధారంగానే భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు జరుగుతున్నాయి. అలాగే ధరణి పోర్టల్​ అమల్లోకి వచ్చిన తర్వాత భూవివాదాలు విపరీతంగా పెరిగాయి. వీటికి సంబంధించిన సర్వేల్లో కొంతమంది లైసెన్స్​డ్ సర్వేయర్లు అధికారులతో కలిసి తెరవెనుక దందాలు నడుపుతున్నారని, ప్రైవేట్​ భూముల సర్వే కోసం వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. కొంతమంది అధికారులు పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతున్న, భూవివాదాలు ఉన్న మండలాల్లో లైసెన్స్​డ్ సర్వేయర్లను నియమించి తెరవెనుక పనులు చక్కబెట్టుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, మంచిర్యాల జిల్లాలో లైసెన్స్​డ్  సర్వేయర్లను తొలగించామని సర్వే అండ్  ల్యాండ్  రికార్డ్స్  ఏడీ శ్రీనివాస్  తెలిపారు.  

కొనసాగిస్తారా? తొలగిస్తారా? 
రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయా మండలాల్లో లైసెన్స్​డ్ సర్వేయర్లు కొనసాగుతున్నారు. ఇటీవల రెగ్యులర్​సర్వేయర్లకు ట్రాన్స్​ఫర్లు జరగడంతో తమ స్థానాల్లో వారికి పోస్టింగులు రాకుండా కొంతమంది తెరవెనుక మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్  సర్కారు వీరిని కొనసాగిస్తుందా? లేక తొలగిస్తుందా? అన్నది క్లారిటీ లేదు. 

రెగ్యులర్​ సర్వేయర్లకు ఖాళీ మండలాల్లో ఇన్​చార్జి బాధ్యలు ఇచ్చి వారి పర్యవేక్షణలో లైసెన్స్‌డ్  సర్వేయర్ల సేవలను వాడుకోవడం బెటర్​ అని పలువురు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. సర్వే చేసిన భూవిస్తీర్ణాన్ని బట్టి ఎంత ఫీజు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించింది. వీరు సర్వే అండ్  ల్యాండ్​ రికార్డ్స్​ డిపార్ట్​మెంట్​ పర్యవేక్షణలో పనిచేస్తూ రికార్డులను ఎప్పటికప్పుడు సమర్పించాల్సి ఉంటుంది. కానీ, గత సర్కారు ఈ పద్ధతిలో కాకుండా ఖాళీ పోస్టుల్లో లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించింది. 2019 నుంచి ఎలాంటి జీతభత్యాలు చెల్లించకుండానే వారిని కంటిన్యూ చేసింది.