తెలంగాణకు అపార నష్టం

తెలంగాణకు అపార నష్టం

రోజుకు రూ. 15 కోట్ల విలువైన పవర్ లాస్

ప్లాంట్‌ రిపేర్లకూ మస్తుగనే ఖర్చయ్యే చాన్స్‌

ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుపై కొనసాగుతున్న ఏపీ పెత్తనం

ప్లాంట్‌ మూతబడితే మరింత పట్టు సాధించే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదంతో రాష్ట్రానికి భారీ నష్టం జరిగేలా ఉంది. కరెంటు ఉత్పత్తి ఆగితే మనకు రోజుకు రూ. 15 కోట్ల విలువైన పవర్‌ లాస్‌ తో పాటు పవర్‌ స్టేషన్‌ రిపేర్లకూ మస్తుగనే ఖర్చయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీశైలంపై పెత్తనం చెలాయిస్తున్న ఏపీ.. మనం పవర్‌ ను ఆపితే ఇంకింత పట్టు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రివర్సిబుల్టర్బయిన్ల ప్లాంట్

శ్రీశైలం రిజర్వాయర్ ఎడమ గట్టున ఉన్న పవర్ ప్లాంట్ తెలంగాణకు అత్యంత విలువైన కరెంట్ ఇస్తోంది. కృష్ణా జలాల్లో మన రాష్ట్రా నికి వచ్చే నీటి వాటాను సమర్థంగా వాడుకునేందుకు ఉపయోగపడుతోంది. మొత్తం 900 మెగావాట్ల పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉన్న ఈ ప్లాంట్‌ లో 6 పవర్ యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్‌ కెపాసిటీ 150 మెగావాట్లు. ఈ ప్లాంట్‌ కు రివర్సిబుల్ టర్బయిన్లను వాడారు. అందుకే మార్కె ట్‌ లో పవర్ డిమాండ్, రేట్ బాగున్నప్పుడు పవర్ ఉత్పత్తి చేస్తారు. ధర తక్కువ ఉన్నప్పుడు రివర్సిబుల్ టర్బైన్లతో కిందున్న నీటిని తిరిగి రిజర్వాయర్‌ లోకి ఎత్తిపోస్తారు. అందుకే టీఎస్ జెన్‌ కో పరిధిలో ఉన్న థర్మల్, హైడల్ ప్రాజెక్టులన్నింట్లో దీనికి ప్రత్యేకత ఉంది. కానీ కృష్ణా నదీ జలాలను, శ్రీశైలం ప్రాజెక్టును కబ్జా చేసేందుకు కొంత కాలంగా ఏపీ ప్లాన్ చేస్తోంది. శ్రీశైలంకు చుక్క నీళ్లు రాకుండా మళ్లించేందుకు పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టును డిజైన్ చేసుకుంది. ఈ టైమ్‌ లో జరిగిన ప్రమాదంతో మన రాష్ట్ర ప్రయోజనాలకు చాలా నష్టం జరగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పవర్హౌజ్కు నీళ్లు ఆపాలని ఏపీ ఫిర్యాదు

శ్రీశైలం రిజర్వాయ్‌ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయినా ఏపీ సర్కారు పెత్తనం చేస్తోంది. ఓవైపు పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేయడంతో పాటు సంగమేశ్వరం లిఫ్ట్ కట్టే కొత్త పనుల వేగం పెంచింది. మరోవైపు ఎస్‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ పవర్ హౌజ్‌ కు నీటి విడుదలను నిలిపేయాలని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ టైమ్‌ లో పవర్​ ప్లాంట్‌ లో జరిగిన ప్రమాదం తెలంగాణకు తీరని నష్టమేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రిపేర్ల కోసం ప్లాంట్ మూతబడితే ఏపీ మరింత పట్టు బిగుస్తుందని, కృష్ణా జలాల్లో తెలంగాణకు వచ్చే వాటాకూ గండి పడుతుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.

రిపేర్లకు మస్తు ఖర్చు

2004 అంచనాల ప్రకారంఎస్‌ ఎల్‌ బీసీ పవర్ హౌజ్ విలువ రూ. 4 వేల కోట్లు. ఇప్పుడీ విలువ  దాదాపు 4 రెట్లు పెరిగింది. అంటే రూ.16 వేల కోట్లు. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టం తీవ్రతను ఇప్పుడే లెక్కగట్టలేమని ఇంజనీర్లు చెబుతున్నారు. అండర్ గ్రౌండ్‌ లో జరిగిన ప్రమాదమని.. మంటలు 10 గంటలకు పైగా ఉండటంతో ప్లాంట్ ఎక్కువ దెబ్బతిని ఉంటుందని, రూఫ్ గ్రౌటింగ్ దెబ్బతింటే భారీ నష్టం జరిగినట్లేనని అంచనా వేస్తున్నారు. దీంతో రిపేర్లకు, ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను తిరిగి నడిపేందుకు లెక్కలేనంత ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇదంతా టీఎస్ జెన్‌‌‌‌‌‌‌‌కోకు ఆర్థిక భారంగా మారుతుందంటున్నారు.

పీక్ సీజన్‌‌‌‌‌‌‌‌.. భారీ నష్టం

కృష్ణా నది ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఉండటంతో ఈ ప్లాంట్ నుంచి రోజుకు దాదాపు రూ.15 కోట్ల విలువైన పవర్ రాష్ట్రా నికి అందుతోంది. ఈ సీజన్‌ లో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 676 మిలియన్ యూనిట్ల పవర్‌ ను ఇక్కడ ఉత్పత్తి చేశారు. ఇన్‌ ప్లో ఎక్కువుండటంతో ఈ నెలలో గత 20 రోజుల్లోనే 399 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి అయింది. గురువారం నాటి ప్రమాదంతో పవర్ ప్లాంట్‌ కు భారీ నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్లాంట్‌ పునరుద్ధరణకు ఎంత టైమ్ పడుతుందో జెన్‌ కో వర్గాలు చెప్పలేకపోతున్నాయి. అప్పటివరకు రోజూ కోట్ల విలువైన కరెంటును కోల్పోవటంతో పాటు రాష్ట్ర అవసరాలకు బయట కొనుక్కోవాల్సి వస్తుంది. శ్రీశైలంలో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు పవర్​ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. ఈ సీజన్‌ లోనే ప్రమాదం జరగటంతో టీఎస్ జెన్‌ కో వర్గా లు తలపట్టుకుంటున్నాయి.

Srisailam power station accident: AE Sundar died who belong to Suryapet