హైదరాబాద్ లోని మాదాపూర్ జోన్ పరిధిలో భారీ ఎత్తున డ్రగ్స్ ను పట్టివేశారు ఎస్ఓటీ పోలీసులు. సోమవారం (నవంబర్ 24) మొదట మాదాపూర్ లో 41కిలోల గంజాయి, 15గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 1.170గ్రాముల అల్ప్రజోలం పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. మూడు చోట్ల డ్రగ్స్ రాకెట్ ను బస్ట్ చేశారు పోలీసులు.
ఈ సందర్భంగా మొదటి కేసుకు సంబంధించి డ్రగ్స్ పట్టివేతకు సంబంధించిన వివరాలను వెల్లడించిన మాదాపూర్ జోన్ డీసీపీ రీతిరాజ్.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పది లక్షల రూపాయల విలువ చేసే 1.170 గ్రాముల అల్ప్రజోలం పట్టుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో గౌండ్ల బాల మురళి కృష్ణ(38) అనే వ్యక్తి చుట్టు పక్కల దుకాణాల్లో సప్లై చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మరో ఇద్దరు పరారీ లో ఉన్నట్లు తెలిపారు.
కేసు2: న్యూ ఇయర్ కోసం బెగళూరు నుంచి:
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల కోసం బెంగుళూరు నుండి తెచ్చినట్లు గుర్తించారు. హరీష్, సాయి కృష్ణ, సాయి మణికంఠ అనే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి ఒక లక్ష 50 వేల విలువ చేసే 15 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.
కేసు3: బీహార్ కూలీలకు గంజాయి అమ్మకం
మూడో కేసులో కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 41కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు డీసీపీ రీతిరాజ్. వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చిన గంజాయిని.. హైదరాబాద్ లో బీహార్ కూలీలకు అమ్ముతున్నారని తెలిపారు. వెస్ట్ బెంగాల్ నుండి సికింద్రాబాద్ వరకు ట్రైన్ లో తెచ్చి అమ్ముతున్నారని చెప్పారు. ఈ కేసులో మిథున్ బర్మాన్, సడెన్ రాయ్, రీజల్ షైక్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారినుంచి 21లక్షల రూపాయల విలువ చేసే 41.9కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
