యూఎస్, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటుందంటూ కొన్నాళ్ల కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే... కేంద్రం అప్రమత్తం అవ్వడంతో దేశంలో ఇంధన కొరత ఏర్పడలేదు. అయితే... ఏపీలో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బంకుల దగ్గర బారులు తీరారు వాహనదారులు. పెట్రోల్ కొరత వస్తుందన్న భయాందోళనతో పలు జిల్లాల్లో జనం పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు జనం.
రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు గత రాత్రి నుండి మూతపడ్డాయి. బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో కొరత భయంతో జనం బారులు తీరారు. పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకు రావడంతో స్పందించారు సీఎం చంద్రబాబు. ఏం జరిగిందన్న విషయంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు.
ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబుకు వివరించారు అధికారులు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో కంపెనీలు సరఫరా నిలిపేశాయని తెలిపారు అధికారులు. దీంతో పాటు బకాయిలు పెండింగ్ ఉన్న బంకులకు కూడా సరఫరా నిలిపేశారని తెలిపారు అధికారులు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్లు జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చంద్రబాబు.

