హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో వివిధ కోర్టుల్లో 1,08,29,979 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో పెండింగ్ కేసులు 5,30,249, ప్రాథమిక దశలోని కేసులు 1,02,99,730 ఉన్నాయని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్. గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వీటిని పరిష్కరించడం ద్వారా కక్షిదారులకు రూ.412.16 కోట్ల మేరకు పరిహారం అందజేశామని చెప్పారు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యాంకోశీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి. వినోద్ కుమార్ ల సహకారంతో కార్యక్రమంలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. హైకోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 302 కేసులు పరిష్కారమయ్యాయి.1600 మందికి రూ.34.36 కోట్ల మేర పరిహారం అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ జె. శ్రీనివాసరావులు లోక్ అదాలత్ బెంచ్‌ల్లో కేసులను పరిష్కరించారు.
చేవెళ్లలో 2,843 కేసులు పరిష్కారం
శనివారం చేవెళ్ల కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించి, 2,843 కేసులు పరిష్కరించారు. సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, రిటైర్డ్జడ్జి సాంబశివరావు పాల్గొన్నారు. పరస్పర అవగాహనతో కేసులు రాజీ చేసుకోవాలని సూచించారు.
