టోల్ ప్లాజాలకు భారీగా పెరిగిన ఆదాయం

టోల్ ప్లాజాలకు భారీగా పెరిగిన ఆదాయం

సంక్రాంతి సందర్భంగా టోల్ ప్లాజాలకు భారీగా ఆదాయం వచ్చింది. నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు పయనమవడంతో టోల్ ప్లాజాలకు కాసుల వర్షం కురిసింది. మొత్తం 11.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోల్చితే రెండు కోట్లపైనే ఆదాయం వచ్చింది. తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు వెళ్లేందుకు పలు జాతీయ రహదారులు దాటాలి. రాష్ట్ర పరిధిలో 28 ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ రాకపోకలు జరిగాయి. పండుగ మూడు రోజుల్లోనే 7 లక్షల 55వేల లావాదేవీలు జరిగాయి. 

ఒక్క హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలోని టోల్ ప్లాజాల దగ్గరే 3 లక్షల 78 వేల లావాదేవీలు జరిగాయి. గతేడాది 9.49 కోట్ల ఆదాయం రాగా...ఈ ఏడాది 11.72 కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఫాస్టాగ్ వినయోగం కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ ఫాస్టాగ్ వినియోగం 81.36శాతం కాగా..ఈ ఏడాది 97.36శాతానికి పెరిగింది. 

గతేడాది జనవరి 13న  మూడున్నరకోట్ల ఆదాయం రాగా..ఈ ఏడాది నాలుగున్నర కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అలాగే జనవరి 14న గతేడాది 3 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది నాలుగు కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 15న లాస్ట్ ఇయర్ రెండున్నర కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది మూడు కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నారు. మొత్తంగా గతేడాది కంటే ఈ ఏడాది ఆదాయం గణనీయంగా పెరిగింది.