
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ను తలపించేలా లక్నోలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. డియోరియాలోని ఈ జంటకు పెళ్లయి ఏడాది అయింది, అయితే తన భార్యకు బీహార్‌కు చెందిన మరో వ్యక్తితో సంబంధం ఉందని అతనికి తెలియదు.
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన ఆకాష్ షా, పెళ్లైన తన ప్రియురాలిని మరువలేకపోయాడు. ఈ క్రమంలో ఆమెను కలిసేందుకు బైక్ పై డియోరియాకు చేరుకుని ఆమెను కలిశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆకాష్‌ను పట్టుకుని కొట్టారు. అయితే దీనిని ఆమె భర్త వివాదం చేయాలని అనుకోలేదు. వారిద్దరి ప్రేమ గురించి తెలుసుకున్నాడు.
అతని భార్య కూడా ప్రియుడితో కలిసి వెళ్తానని బతిమాలింది. దీంతో తన భార్య కుటుంబంతో వారిని ఒప్పించి భార్య, ఆమె ప్రియుడు ఆకాష్‌ను స్థానిక గుడికి తీసుకెళ్లి పెళ్లి చేశాడు. అనంతరం ప్రియుడు వచ్చిన బైక్ ఎక్కించి ఆ జంటకు వీడ్కోలు పలికాడు.