'The Kerala Story 2': 'ది కేరళ స్టోరీ 2' విడుదలకు బ్రేక్.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు!

'The Kerala Story 2': 'ది కేరళ స్టోరీ 2' విడుదలకు బ్రేక్..  కేరళ హైకోర్టు సంచలన తీర్పు!

‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' (The Kerala Story 2: Goes Beyond) వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ సినిమా రేపు విడుదల కావాల్సి ఉండగా.. చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ మూవీ రిలీజ్ ను కేరళ హైకోర్టు తాత్కాలికంగా అడ్డుకుంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

కోర్టులో అసలేం జరిగింది?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. సినిమా కంటెంట్ మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉందని పిటిషనర్లు ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇచ్చింది.

ALSO READ : నటి రన్యా రావుకు ఈడీ షాక్.. 

హైకోర్టు లేవనెత్తిన కీలక ప్రశ్నలు

ఈ చిత్రానికి 'U/A 16+' సర్టిఫికేట్ ఇవ్వడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సామాజిక ప్రభావం అధికంగా ఉండే ఇలాంటి చిత్రాలకు మరింత కఠినమైన వర్గీకరణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఒక రాష్ట్రం పేరును టైటిల్‌లో వాడుతూ, అక్కడ సామాజిక అశాంతి ఉన్నట్లు చూపించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లోగా స్పందించి, అప్పీల్‌ను పరిశీలించాలని ఆదేశించింది. సినిమా కథనం , శీర్షికకు సంబంధించి ప్రజల సందేహాలకు న్యాయపరమైన పరిశీలన అవసరమని ధర్మాసనం తీర్పి ఇచ్చింది.

నిర్మాతల వాదన ఏంటి?

ఈ చిత్రం కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాలేదని, 'గోస్ బియాండ్' అనే సబ్‌టైటిల్ సూచించినట్లుగా మూడు రాష్ట్రాల్లోని వాస్తవ గాథల ఆధారంగా రూపొందించామని నిర్మాతల తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే సెన్సార్ బోర్డు సూచన మేరకు 16 కట్‌లు, డైలాగ్ మార్పులు , సుదీర్ఘమైన డిస్క్లైమర్‌ను జోడించామని వారు స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కోర్టు స్టే విధించడానికే మొగ్గు చూపింది.

సామాజిక ఉద్రిక్తతలకు తావు లేకుండా..

గతంలో కేరళ స్టోరీ మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు, నిరసనలు జరిగాయి. ఇప్పుడు రెండో భాగం మరింత వివాదాస్పద అంశాలతో వస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో, కేరళ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, ఇది సమాజంలోని మత సామరస్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలో న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి సినిమా థియేటర్లలోకి రావడం నిలిచిపోయింది. తదుపరి విచారణలో హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే 'ది కేరళ స్టోరీ 2' భవితవ్యం ఆధారపడి ఉంది.